సర్‌కు ముందే స్థానికం!
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:34 AM
కొత్త ఓటర్ల జాబితా ప్రకటించక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘సర్’ (ఎస్‌ఐఆర్) తర్వాత తాజా ఓటర్ల జాబితా అక్టోబరు 3న అమల్లోకి వస్తుందని... ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్లీ వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని సీఎం దృష్టికి తెచ్చారు. అందువల్ల అక్టోబరు 3లోపే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.
మంత్రులతో భేటీలో చర్చ
న్యాయ నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం: సీఎం
బలి చేయడం జగన్ నైజం
స్కాముల్లోకి పార్టీ నేతలను దింపుతారు
కొంత ఎర వేసి..చివరకు బలి చేస్తారు
మద్యం రవాణా స్కామ్‌లో జరిగిందిదే
దొరికిపోయిన ప్రతిసారీ జగన్ కులం,
సెంటిమెంటు కార్డులను తీస్తారు
బీసీలకు న్యాయం జరగాల్సిందే..
దాని కోసం ఎంతవరకైనా పోరాడుదాం
మంత్రులతో లంచ్ భేటీలో సీఎం
అమరావతి: కొత్త ఓటర్ల జాబితా ప్రకటించక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘సర్’ (ఎస్‌ఐఆర్) తర్వాత తాజా ఓటర్ల జాబితా అక్టోబరు 3న అమల్లోకి వస్తుందని... ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్లీ వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని సీఎం దృష్టికి తెచ్చారు. అందువల్ల అక్టోబరు 3లోపే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. మంగళవారం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు లంచ్ భేటీ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ అనంతరం వచ్చే తాజా ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్లాలంటూ కోర్టును ఆశ్రయించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రులు ఆయన దృష్టికి తెచ్చారు. న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం దీనిపై ఒక నిర్ణయానికి వద్దామని సీఎం చెప్పారు. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టామని, ఇందులో ఎవరి బలం ఏమిటో తెలిసిపోతుందని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని కుంభకోణాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు దోచుకోవడం, అందులో పార్టీ నేతలను భాగస్వాములను చేసి, వారికి కొద్ది మొత్తం పడేసి.. చివరకు బలిచేయడం వైసీపీ అధినేత జగన్‌కు అలవాటేనని ముఖ్యమంత్రి అన్నారు.
మద్యం రవాణా కుంభకోణంలో సరిగ్గా ఇలాగే జరిగిందని చెప్పారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మీద ఈ సందర్భంగా చర్చ జరిగింది. మద్యం రవాణా కుంభకోణంలో కేసుకు రూ.12 రవాణా చార్జీకి బదులు రూ.35 వేసి వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని మంత్రులు సీఎంతో అన్నారు. కారుమూరికి కొంత మొత్తం ఇచ్చి మెజారిటీ వాటాను ఎవరు తీసుకున్నారో తేల్చాల్సి ఉందని చెప్పారు. ఈడీ తనిఖీలు.. అరెస్టులు చేస్తే కూటమిపై ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకే చెల్లిందని పలువురు వ్యాఖ్యానించారు. సీఎం స్పందిస్తూ.. ప్రజలకు అన్ని విషయాలూ తెలుస్తున్నాయని, మనం కూడా వారికి వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. వైసీపీ పాలనను ఒకసారి చూసిన జనం భయపడిపోయారని, తిరిగి ఆ పార్టీకి అధికారం ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టంచేశారు.
బీసీలకు మేలు చేసిందే టీడీపీ..
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. దీనిపై కోర్టుల్లో ఎన్ని వ్యాజ్యాలు దాఖలైనప్పటికీ ప్రభుత్వ వాదన బలంగా వినిపిద్దామన్నారు. ‘‘1995 నుంచీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కొనసాగుతున్నాయి. 2019లో చట్టాన్ని సవరించకుండా రిజర్వేషన్లపై జీవో ఇచ్చి అప్పటి సీఎం జగన్ బీసీ రిజర్వేషన్లు తగ్గించేందుకు కారణమయ్యారు. ఈ విషయాలన్నింటినీ బీసీల్లోకి బలంగా తీసుకెళ్లాలి. దీనిపై వైసీపీ బీసీ నేతలు సమావేశాలు పెట్టి చేస్తున్న వ్యాఖ్యలను మంత్రులు సమర్థంగా తిప్పికొట్టాలి. వైసీపీ నాయకులు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంపై విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు సుప్రీంకోర్టు వరకు వెళదాం.’’ అని సీఎం అన్నారు.
వైసీపీ హయాంలో జగన్ చేతకానితనం వల్లే బీసీలకు రిజర్వేషన్లు పోయాయని, బీసీలను అణగదొక్కేందుకే జగన్ చట్టాన్ని సవరించకుండా బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేశారని అచ్చెన్నాయుడు సీఎంతో అన్నారు. యువకులు, విద్యార్థులకు అన్ని విషయాలను తెలపాలని, ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ రంగంలో కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి వారికి వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు. జెన్‌జీకి పార్టీ నాయకులు చేరువ కావాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు తానే శంకుస్థాపన చేశానని, 30 ఏళ్ల తర్వాత తిరిగి తానే ప్రారంభోత్సవం చేస్తున్నానని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి కాకుండా ప్రారంభోత్సవం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని మంత్రులు ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు కూడా మనమే న్యాయం చేశామని, మరో విడత నష్ట పరిహారం ఇస్తే అందరికీ ఇచ్చినట్లు అవుతుందని సీఎం తెలిపారు. సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము అడ్డగోలుగా తినేయడం, తప్పు చేసి దొరికిపోతే కిందివాళ్లను బలిచేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య. బాబాయ్‌ని హత్య చేసేందుకు రూ.40 కోట్ల సుపారీ కుదుర్చుకుని, అందులో కొంత అడ్వాన్స్‌గా ఇచ్చారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో తప్పేముంది? తప్పు చేసి దొరికిపోయిన ప్రతిసారీ కులం కార్డు, సెంటిమెంట్ కార్డు వాడటం అలవాటు చేసుకున్నారు’’
- సీఎం చంద్రబాబు