Share News

శ్రీసిటీలో బాయిలర్‌ పేలి ఐదుగురు కార్మికుల మృతి

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:58 AM

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో బాయిలర్‌ పేలి ఐదుగురు కార్మికులు మృతిచెందారు.

శ్రీసిటీలో బాయిలర్‌ పేలి ఐదుగురు కార్మికుల మృతి

  • తిరుపతి శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కార్మికుల దుర్మరణం

  • ఎస్టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో దుర్ఘటన

  • పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం

  • బాయిలర్‌లోని నీటి స్థాయి విషయంలో తేడా కారణంగానే పేలుడు?

  • మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం

తిరుపతి(టీటీడీ)/సత్యవేడు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీసిటీలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. టిల్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమకు చెందిన బాయిలర్‌ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతుల్లో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు, పశ్చిమబెంగాల్‌ వాసి ఒకరు ఉన్నారు. బాయిలర్‌లోని నీటి స్థాయి విషయంలో తేడా కారణంగానే పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి ఒక్కసారిగా భవనం మొత్తం కుప్పకూలింది. భవన శకలాలు సమీప ప్రాంతాలతోపాటు కొంతదూరంలోని పొలాల్లో సైతం పడ్డాయి. టిల్‌హెల్త్‌ కేర్‌ భవనంలోని అద్దాలు పగిలిపోయాయి. పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలకూ స్వల్ప నష్టం వాటిల్లింది. భారీ పేలుడు కారణంగా టిల్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమకు ఆనుకుని ఉన్న చెరివి, మాధనపాళెం, గొల్లవారిపాళెం తదితర గ్రామాల్లోని ఇళ్లన్నీ కంపించాయి. ఇళ్ల కిటికీ అద్దాలు పగిలి, కొన్ని ఇళ్లలోని గోడలు బీటలు వారాయి. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల మేర వినిపించిందని, భూమి కూడా స్వల్పంగా కంపించినట్లయ్యిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంతో శ్రీసిటీ ఉలిక్కిపడింది. శ్రీసిటీ ఏర్పాటు చేసిన 18 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి.


అసలేం జరిగింది?

గాంధీ జయంతి కారణంగా శుక్రవారం పరిశ్రమకు సెలవు. దీంతో శనివారం ఉదయం 8.30 గంటలకు షిఫ్ట్‌ ప్రారంభమైంది. బాయిలర్‌ ఆపరేటర్‌గా ఉన్న తడకు చెందిన వాసు (38), అతని హెల్పర్‌ తమిళనాడు మాదరపాక్కంకు చెందిన రమేశ్‌ (45) బాయిలర్‌ హౌస్‌కు చేరుకున్నారు. బాయిలర్‌లోని నీటి స్థాయిలను చెక్‌ చేసుకోకుండా.. దాన్ని ఆన్‌ చేయడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి బాయిలర్‌ భవనం కుప్పకూలింది. వాసు, రమేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్‌ హౌస్‌కు ఆనుకుని ఉన్న ఆలయానికి దండం పెట్టుకునేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్‌వో ప్లాంట్‌ ఇన్‌చార్జి గౌరబ్‌రాయ్‌(36), భవనం పక్కనే ఉన్న తమిళనాడులోని నాయుడుకుప్పానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ మోహన్‌రాజు(19), సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన ఈటీపీ ఆపరేటర్‌ చిన్న మస్తాన్‌(45)పైనా శకలాలు పడ్డాయి. గౌరబ్‌రాయ్‌, మోహన్‌రాజు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన రమేశ్‌, చిన మస్తాన్‌లను సత్యవేడులోని సీహెచ్‌సీకి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వాసును చెన్నైలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం ఉదయం షిఫ్ట్‌కు కార్మికులు, ఉద్యోగులు కంపెనీ గేటు ముందు బస్సు దిగి ఫ్యాక్టరీలోకి వస్తున్న క్రమంలోనే పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయపడ్డారు. కొందరు అక్కడకు వెళ్లి గాయపడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు.


బాయిలర్‌లో నీళ్ల కొరత కారణంగానేనా?

ఘటన స్థలాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి పరిశీలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాయిలర్లు 30 ఏళ్ల వరకు పనిచేస్తాయని, ఇక్కడి బాయిలర్‌ పన్నెండున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేశారని తెలిపారు. నీళ్ల కొరత/నీళ్లు అందకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నామన్నారు. ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబును సస్పెండ్‌ చేశామని, శ్రీసిటీలోని అన్ని పరిశ్రమల్లోనూ సేఫ్టీ ఆడిట్‌ చేయిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు మేరకు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద శ్రీసిటీ నుంచి కొంత మొత్తం అందించినట్లు చెప్పారు. శ్రీసిటీ యాజమాన్యం తరఫున మృతుల కుటుంబాల్లోని పిల్లలకు ఉచిత విద్య, కుటుంబంలో ఒకరికి శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉద్యోగం వంటి ఉపశమన చర్యలను కూడా ప్రకటించారు.

చంద్రబాబు, లోకేశ్‌ దిగ్భ్రాంతి

శ్రీసిటీ సెజ్‌లోని టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, ప్రాణ నష్టం గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బాయిలర్‌ పేలి కార్మికులు మృతిచెందడం తీరని విషాదమని మంత్రి లోకేశ్‌ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 04:58 AM