వీధి కుక్కల నియంత్రణకు చర్యలు.. ఏపీ హైకోర్టులో సీఎస్ సాయిప్రసాద్ అఫిడవిట్
ABN , Publish Date - Aug 08 , 2026 | 06:57 AM
వీధి కుక్కల బెడద నివారణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) విష్ణుతేజ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో సీఎస్ జి.సాయిప్రసాద్ అఫిడవిట్ దాఖలు చేశారని నివేదించారు.
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు
సుప్రీం ఆదేశాలు అమలు చేస్తున్నాం
హైకోర్టులో సీఎస్ సాయిప్రసాద్ అఫిడవిట్
అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది నియామకం
తదుపరి విచారణ వాయిదా
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల బెడద నివారణ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) విష్ణుతేజ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో సీఎస్ జి.సాయిప్రసాద్ అఫిడవిట్ దాఖలు చేశారని నివేదించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రస్తుత కేసు విచారణలో కోర్టుకు సహకారమందించేందు అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది కె.చిదంబరాన్ని నియమించింది. మిగిలిన ప్రతివాదులను అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్టెరిలైజేషన్ తర్వాత శాశ్వతంగా షెల్టర్లకు
దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడిలో పిల్లలు, వృద్ధులు మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఏడాది మే 19న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, క్రీడా మైదానాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంగణాల్లో సంచరించే వీధి కుక్కలను తీసుకొని వెళ్లి వాటికి స్టెరిలైజేషన్ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అనంతరం వాటిని శాశ్వతంగా ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేసింది. ప్రాంగణాల్లోకి కుక్కలు చొరబడకుండా ఫెన్సింగ్, గోడ నిర్మించుకోవాలని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 8 వారాల సమయం ఇచ్చిం ది. పిచ్చిపట్టి, జబ్బు నుంచి కోలుకోలేక క్రూరంగా ప్రవర్తించే వీధి కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించేందుకు అధికారులకు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించింది. ఈ ఆదేశాలను హైకోర్టు సుమోటో రిట్‌గా మలిచిన విషయం తెలిసిందే.
సీఎస్ అఫిడవిట్‌లో ఏముందంటే..
‘కుక్క కాటుకు గురైనప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులపై పాఠశాల పిల్లలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. 73 షెల్టర్లు ఏర్పాటు చేశాం. మరో 21 షెల్డర్ల ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాంగణాల నుంచి ఇప్పటివరకు 3,041 వీధి కుక్కలను షెల్టర్స్‌కు తరలించాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచీ రేబిస్ నిరోధక వ్యాక్సిన్లు నిల్వ చేశాం.. అని సీఎస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్