Share News

తీరు మార్చుకోని అధికారి!

ABN , Publish Date - Aug 08 , 2026 | 06:37 AM

దురుసు స్వభావానికి పెట్టింది పేరైన సీఎంవోలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్రా మరోసారి తన విశ్వరూపం చూపారు. గతంలో గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను నీచ పదజాలంతో దూషించి, ఏకంగా షూను బహుమతిగా పంపిన ఘటనను మరవక ముందే, తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో సాక్షాత్తూ తన సహచర ఐఏఎస్‌ అధికారిపైనే దూషణల పర్వానికి దిగారు.

తీరు మార్చుకోని అధికారి!

  • ‘వైసీపీ’ అధికారులకు కార్తికేయ మిశ్రా వత్తాసు

  • ప్రశ్నించినందుకు సహచర ఐఏఎస్‌పై బూతులు

  • వివాదాస్పదుడిగా మురళీధర్‌ రెడ్డిపై ముద్ర

  • పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కనపెట్టిన కూటమి

  • ఆయనను సీఎం వద్దకు తీసుకెళ్లిన మిశ్రా

  • కృష్ణా కలెక్టరుకు బూటు పంపి గతంలో వివాదం

అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): దురుసు స్వభావానికి పెట్టింది పేరైన సీఎంవోలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్రా మరోసారి తన విశ్వరూపం చూపారు. గతంలో గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను నీచ పదజాలంతో దూషించి, ఏకంగా షూను బహుమతిగా పంపిన ఘటనను మరవక ముందే, తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో సాక్షాత్తూ తన సహచర ఐఏఎస్‌ అధికారిపైనే దూషణల పర్వానికి దిగారు. ఆ వివరాల్లోకి వెళితే.. వైసీపీ హయాంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా మురళీధర్‌ రెడ్డి పనిచేశారు. ఆ సమయంలో పూర్తిస్థాయి వైసీపీ నేతగా మురళీధర్‌ రెడ్డి వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మురళీధర్‌రెడ్డికి పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఆ తర్వాత కూడా ఆయన వైసీపీ నేతలతో నిరంతరం కాంటాక్ట్‌లో ఉన్నారు.


ఈ నేపథ్యంలో మురళీధర్‌ రెడ్డికి పోస్టింగ్‌ ఇప్పించే ఉద్దేశంతో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా కార్తికేయ మిశ్రా కబురు పంపారు. తన వద్దకు వచ్చిన మురళీధర్‌ రెడ్డిని స్వయంగా దగ్గరుండి సీఎం వద్దకు తీసుకొని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో అక్కడే ఉన్న మరో ఐఏఎస్‌ అధికారి.... మురళీధర్‌రెడ్డిని సీఎం వద్దకు తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జీఏడీ వ్యవహారాలు చూసేవాళ్లు చేయాల్సిన పని మీరెందుకు చేస్తున్నారు?’ అంటూ మిశ్రాను ప్రశ్నించారు. దీంతో ఉగ్రరూపం దాల్చిన కార్తికేయ మిశ్రా, తనను ప్రశ్నించిన అధికారిపై బూతులతో విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో ఇద్దరూ పరస్పరం తోసుకునే వరకు పరిస్థితి వచ్చింది. ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని వారిని సర్దుబాటు చేసి పంపారు.


పేషీలోనూ వివాదాస్పదులే..

కార్తికేయ మిశ్రా పేషీలోనూ వివాదాస్పదులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలున్నాయి. ఆయన వద్ద ఓ సీనియర్‌ అధికారి ఓఎస్డీగా చేస్తుండగానే, ఓ వివాదాస్పద వ్యక్తిని కొద్ది రోజుల క్రితం ఓఎస్డీగా నియమించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఈ వ్యక్తిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలున్నాయి. పైగా వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అనుంగు అనుచరుడిగా ఆయనకు పేరుంది. వైసీపీ ప్రభుత్వంలో బొత్స ఆశీస్సులతో ఈ వ్యక్తి ఆప్కాస్‌ ఎండీగా నియమితులయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలిరోజుల్లో సీఎంవోలోని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఈ వ్యక్తిని తన ఓఎస్డీగా నియమించుకున్నారు. ఆ తర్వాత ఆయన అవినీతి బాగోతం తెలియడంతో పక్కన పెట్టేశారు. అలాంటి వ్యక్తిని మిశ్రా తన ఓఎస్డీగా నియమించుకోవడం వివాదాస్పదమవుతోంది. వైసీపీతో అంటకాగే వ్యక్తిని సీఎంవోలో నియమించుకుంటే పేషీలోని కీలక ఫైళ్ల సమాచారం మొత్తం వైసీపీకి చేరడం పెద్ద కష్టమైన పనేం కాదు.


ఇవి కూడా చదవండి

మొండి బ్యాక్టీరియాపై పోరుకు.. ఏఐ సాయంతో కొత్త వైర్‌సల సృష్టి

కోటీశ్వరులకు రైతుబంధు ఎందుకు?

Updated Date - Aug 08 , 2026 | 06:37 AM