మొండి బ్యాక్టీరియాపై పోరుకు.. ఏఐ సాయంతో కొత్త వైరస్‌ల సృష్టి
ABN , Publish Date - Aug 08 , 2026 | 06:27 AM
మందులకు లొంగని మొండి బ్యాక్టీరియాపై పోరాటానికి, జీవ శాస్త్రంలో కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్ని పరీక్షించడానికి.. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలు ఫలించాయి.
302 వైర్‌సలను ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు
వాటిలో 16 వైర్‌సలు ఈ-కొలి సూక్ష్మజీవిని విజయవంతంగా నిర్మూలించినట్టు వెల్లడి
ఈ సాంకేతిక పరిజ్ఞానం దుష్టుల చేతుల్లో పడితే పెనుప్రమాదమే: నిపుణుల ఆందోళన
శాక్రమెంటో, ఆగస్టు 7: మందులకు లొంగని మొండి బ్యాక్టీరియాపై పోరాటానికి, జీవ శాస్త్రంలో కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్ని పరీక్షించడానికి.. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలు ఫలించాయి. ఏఐ సాయంతో వారు 302 కొత్త వైర్‌సలను సృష్టించగలిగారు. అది కూడా.. డీఎన్‌ఏ నిర్మాణంలో కీలకమైన అడెనిన్ (ఏ), థైమిన్ (టి), సైటోసీన్ (సి), గ్వానిన్ (జీ) అనే రసాయన ముడిపదార్థాలను (న్యూక్లియోటైడ్స్‌ను) ల్యాబ్‌లో కృత్రిమంగా తయారుచేసి, వాటిని ఏఐ చెప్పిన క్రమ పద్ధతిలో అమర్చి సృష్టించారు. అంటే.. ఇందులో ఏదీ సహజమైన వైరస్ కాదు. పూర్తిగా కృత్రిమ వైరస్. అలా సృష్టించినవాటిలో 16 వైర్‌సలు.. ఈ-కొలి బ్యాక్టీరియాను విజయవంతంగా చంపగలిగాయి. మానవజాతి చరిత్రనే మార్చేసే అద్భుతమైన పరిశోధనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పూర్తిస్థాయి జన్యుక్రమాన్ని (లేదా) ఒక పనిచేసే జీవిని సృష్టించడానికి అవసరమైన పూర్తిస్థాయి జన్యు ఆదేశాలను రూపొందించడం మానవజాతి చరిత్రలోనే ఇది తొలిసారి. యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటం వల్ల బ్యాక్టీరియాలు ఆ మందులకు చనిపోకుండా మొండిగా తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టాన్‌ఫర్డ్ శాస్త్రజ్ఞులు.. అలాంటి బ్యాక్టీరియాలను చంపగలిగే కొత్త వైర్‌సలను సృష్టించడానికి కృత్రిమ మేధను వినియోగించారు. అందులో భాగంగా.. జీన్‌బ్యాంక్ వంటి జీవశాస్త్ర డేటాబేస్‌లలోని సమాచారాన్ని ‘ఎవో(ఈవీవో)’ అనే ఏఐ ఫౌండేషన్ మోడల్‌కు ఇచ్చారు.
అమెరికాలోని అర్కాడియా సైన్స్, ఆర్క్ ఇన్‌స్టిట్యూట్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు జన్యుశాస్త్ర పరిశోధనల నిమిత్తం ఉమ్మడిగా అభివృద్ధి చేసిన ఏఐ మోడల్ ఈ ‘ఎవో’. మానవజాతి పరిణామక్రమాన్ని (ఎవల్యూషన్) దృష్టిలో ఉంచుకుని వారు ఈ మోడల్‌కు ‘ఎవో’ అనే పేరు పెట్టారు. ఈ ‘ఎవో’ మోడల్.. జీవుల డీఎన్‌ఏలోని జన్యుభాషను (ఏ, టీ, సీ, జీ అమరికను) అర్థం చేసుకుంటుంది. విశ్లేషిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా కొత్త జన్యు కోడ్‌ను కూడా రాయగలుగుతుంది. అంటే.. ఏకంగా ఒక కొత్త కృత్రిమ జీవిని సృష్టించగలుగుతుంది. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ‘ఎవో 1’, ‘ఎవో 2’ ఏఐ మోడళ్లకు.. ‘‘ఈ-కొలి’ బ్యాక్టీరియాను చంపగలిగే ఒక కొత్త వైర్‌సకు డీఎన్‌ఏ కోడ్ రాయి’’ అని ప్రాంప్ట్ ఇచ్చారు. ఆ రెండు మోడళ్లూ వారికి వేలాది డీఎన్‌ఏ కోడ్‌లను ఇచ్చాయి. అవి ఇచ్చిన కోడ్‌ల ఆధారంగా.. కృత్రిమ డీఎన్‌ఏను సృష్టించడానికి వారు ‘కెమికల్ డీఎన్‌ఏ సింథసిస్’ అనే ప్రక్రియను వినియోగించారు. డీఎన్‌ఏలో ఉండే ప్రాథమిక రసాయన అణువులైన అడెనిన్, థైమిన్, సైటోసీన్, గ్వానిన్‌లను.. ల్యాబ్‌లో కృత్రిమంగా తయారుచేశారు. ‘డీఎన్‌ఏ సింథసైజర్స్’ అని పిలిచే ప్రత్యేక యంత్రాల సహాయంతో ఆ అణువులను సరిగ్గా ‘ఎవో’ ఏఐ మోడళ్లు ఇచ్చిన క్రమంలో అమర్చి 302 డీఎన్‌ఏ గొలుసులను(ఇవే కృత్రిమ వైరస్‌లు) తయారుచేశారు. ఆ గొలుసులను తీసుకెళ్లి ‘ఈ-కొలి’ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. వారు సృష్టించినవాటిలో 16 కృత్రిమ వైర్‌సలు ఈ-కొలి బ్యాక్టీరియాను చంపగలిగాయి. శాస్త్రజ్ఞులు సృష్టించిన ఈ కొత్త వైర్‌సలన్నీ బ్యాక్ట్రియో ఫేజ్‌లే. అంటే కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే దాడి చేస్తాయి తప్ప మనుషులకు వాటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. జంతువులకు, మొక్కలకు కూడా అపాయం ఉండదు. దీని సాయంతో.. శరీరంలో నిర్దిష్టమైన కణాలకు (ఉదాహరణకు క్యాన్సర్ కణాలకు) మాత్రమే మందులను చేరవేసే జన్యురవాణా వాహనాల వంటివాటిని కూడా తయారుచేసే అవకాశం ఉంది.
ప్రమాదమూ ఉంది
ఈ కొత్త వైర్‌సలు మానవాళికి మేలు చేసేవి కాబట్టి భయపడాల్సిన పని లేదు. కానీ.. ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఉగ్రవాదులు మానవాళికి మనుగడకే ప్రమాదంగా మారే కొత్త వైర్‌సలను సృష్టిస్తే? వాటిని జీవాయుధాలుగా మార్చి ప్రయోగిస్తే? అని జీవశాస్త్రజ్ఞులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.