సింగీతం శ్రీనివాసరావు మరణం చిత్ర సీమకు తీరని లోటు: మంత్రి దుర్గేశ్
ABN , Publish Date - Oct 04 , 2026 | 07:12 AM
ప్రముఖ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాస రావు మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన గొప్ప దర్శకుడు సింగీతం మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు అని మంత్రి అన్నారు.
అమరావతి, అక్టోబర్ 4: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు మృతి పట్ల ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. టాకీ కాలంలో.. మాటలు లేని నిశ్శబ్ద హాస్య చిత్రం పుష్పక విమానం వంటి గొప్ప సినిమా తీసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. భారతీయ వెండితెరకు టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 సృష్టించి విజయం సాధించిన ఘనత పొందారు. ఆధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని కాలంలోనే లెన్స్ ట్రిక్స్‌తో అపూర్వ సహోదరులు సినిమాతో మరుగుజ్జు పాత్రను సృష్టించి సాంకేతిక విస్మయం కలిగించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేరు. దశాబ్దాల సినీ ప్రయాణంలో నిరంతరం కొత్తదనాన్ని అన్వేషించిన సింగీతం శ్రీనివాసరావు 94ఏళ్ళ వయసులోనూ సరికొత్త ఆలోచనలతో కథలను తెరకెక్కించవచ్చని నేటి తరం దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి దార్శనికుడిని కోల్పోవడం చాలా బాధాకరం’ అని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి: