Share News

ఎన్నికలు గెలవలేక వైసీపీ అల్లర్లు చేస్తోంది.. మంత్రి సత్య కుమార్

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:44 PM

ధర్మవరంలో మున్సిపల్ కార్యాలయానికి మంత్రి సత్య కుమార్ ఈరోజు (ఆదివారం) చేరుకుని బీజేపీ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

ఎన్నికలు గెలవలేక వైసీపీ అల్లర్లు చేస్తోంది.. మంత్రి సత్య కుమార్
Minister Satya Kumar

శ్రీ సత్యసాయి జిల్లా, అక్టోబర్ 18: ధర్మవరంలో మున్సిపల్ కార్యాలయానికి మంత్రి సత్య కుమార్ ఈరోజు (ఆదివారం) చేరుకుని బీజేపీ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతిపక్షం ఓటమి అంగీకరించినట్టుగా ఉంది. అందుకే ఆ పార్టీ నాయకులు ఎన్నికలు సక్రమంగా జరగకుండా అల్లర్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలే చేశారు. మళ్లీ ఇప్పుడూ అవే చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారు. ధర్మవరంలో అశాంతి సృష్టించారు. ఇలాంటి ప్రయత్నాలను సాగనివ్వం.. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు’ అంటూ ఆయన ఫైరయ్యారు.


అలాగే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్య కుమార్ మండిపడ్డారు. ఆయన వీల్‌ఛైర్లలో తిప్పుతున్నది రౌడీషీటర్లనని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కరుడుగట్టిన నేరస్థులను వైసీపీ నాయకులు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. దాడులు చేసి మళ్లీ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ఓటమి భయంతోనే కేతిరెడ్డి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో నామినేషన్ల ప్రక్రియను అడ్డుకున్న ఘనచరిత్ర కేతిరెడ్డిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గుండాలు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


ఈ వార్తలూ చదవండి

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులు.. పుంగనూరుకు రావొద్దని ఆదేశం

పుంగనూరు దాడులు.. మిథున్‌రెడ్డిపై కేసులు

Updated Date - Oct 18 , 2026 | 01:44 PM