తిరుపతిలో వైసీపీ మేయర్ అభ్యర్థి అడ్డగింత!
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:53 AM
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పలు నామినేషన్ కేంద్రాల వద్ద శనివారం గొడవలు, తోపులాటలు జరిగాయి. వైసీపీ మేయర్ అభ్యర్థి ఎచ్చెం వాసుదేవ యాదవ్ నామినేషన్ వేయకుండా కూటమి శ్రేణులు అడ్డుకున్నాయి.
నామినేషన్ వేయకుండా అడ్డుకున్న కూటమి శ్రేణులు
వాహనాలపై రాళ్ల దాడి... రోడ్డుపై పడుకొని నినాదాలు
గడువు ముగిసిపోవడంతో వెనుదిరిగిన వైసీపీ అభ్యర్థి
తిరుపతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పలు నామినేషన్ కేంద్రాల వద్ద శనివారం గొడవలు, తోపులాటలు జరిగాయి. వైసీపీ మేయర్ అభ్యర్థి ఎచ్చెం వాసుదేవ యాదవ్ నామినేషన్ వేయకుండా కూటమి శ్రేణులు అడ్డుకున్నాయి. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వాసుదేవ యాదవ్ వచ్చారు. ఆయనతో పాటు ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి తదితరులు ఉన్నారు. అయితే కార్యాలయం వద్దే కూటమి శ్రేణులు వైసీపీ అభ్యర్థి వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం ఆపకపోవడంతో రాళ్లతో దాడి చేశారు.
రోడ్డుపై అడ్డుగా పడుకొని వాహనం ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. తమను అక్కడ నుంచి తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ పోలీసులను బెదిరించారు. ‘వైసీపీ డౌన్డౌన్... గతంలో మీరు చేశారు... ఇపుడు మేము చేస్తున్నాం... అపుడు మీరు నేర్పించిందే ఇది...’ అంటూ నినాదాలు చేశారు. ఈలోపు నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసిపోవడంతో వైసీపీ అభ్యర్థి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనిపై వాసుదేవ యాదవ్, ఇతర వైసీపీ నాయకులు ఎస్పీ సుబ్బరాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనకు ముందే వైసీపీ మేయర్ అభ్యర్థి తరపున నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గురుమూర్తి, సిపాయి సుబ్రహ్మణ్యం మున్సిపల్ కార్యాలయం వద్దకు రాగా టీడీపీ కార్యకర్తలు ఆ పత్రాలు లాక్కుని పరారయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ