గెలిచి తీరాలి!
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:36 AM
ప్రతి మున్సిపాలిటీని, ప్రతి పంచాయతీని కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలన్నారు.
ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీ గెలవాలి: సీఎం
ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా
అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే
కేటాయింపులో సోషల్ రీ-ఇంజనీరింగ్
అన్ని వర్గాలకూ సమాన అవకాశాలిచ్చాం
11 కార్పొరేషన్ మేయర్ స్థానాలను 11 సామాజిక వర్గాలకు కేటాయించాం
కూటమి నేతలంతా మిత్రధర్మం పాటించాలి
గొడ్డలి పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి: బాబు
టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రతి మున్సిపాలిటీని, ప్రతి పంచాయతీని కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయం సాధించాలన్నారు. నేతలందరూ క్షేత్ర స్థాయికి వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ రీ-ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించామని న్నారు. టీడీపీ పోటీచేస్తున్న 11 మేయర్ స్థానాలను 11 వేర్వేరు సామాజిక వర్గాలకు కేటాయించామని తెలిపారు. కూటమి నేతలు మిత్ర ధర్మం పాటిస్తూ అందరినీ కలుపుకొని వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికలపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల్లో 2024 ఎన్నికల ఫలితాలకు మించిన స్థాయిలో ఓట్ల శాతం పెరగాలన్నారు. గెలుస్తామన్న ధీమాతో వ్యవహరించకుండా అంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫలితాలు సాధించాల్సిందేనని తేల్చిచెప్పారు. సోషల్ రీ-ఇంజనీరింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరిగిందని, జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించామని తెలిపారు.
ప్రజాభిప్రాయం.. శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల ఎంపిక చేపట్టామని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో 50 శాతం కంటే ఎక్కువ మద్దతు ఉన్న వారినే ఎంపిక చేశామని.. కొందరి అభ్యర్థిత్వాలకు 80 శాతానికి మించిన మద్దతు లభించిందన్నారు.
ఐక్యంగా ముందుకెళ్లాలి..
కూటమి పార్టీల మనోభావాలను గౌరవించాలని.. కూటమి పార్టీలన్నీ కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలని సీఎం సూచించారు. ‘పార్టీని బలోపేతం చేయాలి... కూటమిగా మరింత బలపడాలి. ఈ రెండూ ముఖ్యమే. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలి.. అప్పుడే అన్ని వర్గాలూ పార్టీకి అండగా నిలుస్తాయి.. సీట్లు దక్కించుకోలేకపోయిన ఆశావహులకు ఈ విషయాన్ని వివరించాలి.
శాస్త్రీయంగా ఆలోచన చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకత్వం ఎదిగేందుకు సహకరించాలి. ఒకట్రెండు చోట్ల తలెత్తిన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, కూటమి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్దాం. అందరం కలిసి ఐక్యంగా కూటమి విజయాన్ని బలంగా చాటాల్సిందే’ అని పునరుద్ఘాటించారు.
గొడ్డలి పార్టీపై ఓ కన్నేయండి..
ఎన్నికల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ పార్టీ చర్యలను నిత్యం గమనిస్తూ ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, దాని కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ