గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీరు
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:51 AM
గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కల్యాణ్ విస్తృత స్థాయి కార్యచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ తాగునీటి పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
విస్తృత కార్యాచరణకు ఉపముఖ్యమంత్రి పవన్ శ్రీకారం
రూ. 26 వేల కోట్లతో జల్ జీవన్ పనులు
ఇప్పటికే 35 కోట్లతో ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ
ప్రతిఒక్కరికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన నీరివ్వడమే లక్ష్యం
ప్రాధాన్యత క్రమంలో పనులకు అధికారులకు పవన్ ఆదేశం
(అమరావతి- ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కల్యాణ్ విస్తృత స్థాయి కార్యచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ తాగునీటి పథకాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా రూ. 35 కోట్లు కేటాయించి, దాదాపు 370 గ్రామాల పరిధిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లు పునరుద్ధరించారు. తద్వారా సుమారు 25 లక్షల మందికి పరిశుభ్రమైన తాగునీటి సరఫరా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ, సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ‘‘జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల’’ ద్వారా దాదాపు రూ. 26 వేల కోట్ల విలువైన పనులు ముందుకు తీసుకువెళ్తున్నారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల ద్వారా వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. మరో పది మల్టీవిలేజ్ స్కీమ్ పథకాలకు రూ. 9,355 కోట్లు మంజూరు చేశారు. అత్యంత తీవ్ర నీటి ఎద్దడి కలిగిన 3 వేల గ్రామాలను గుర్తించి, రూ. 1,814 కోట్లతో సింగిల్ విలేజ్ వాటర్ స్కీమ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటితో పాటు గత ప్రభుత్వం అరకొర పనులు చేసి వదిలివెళ్లిన పులివెందుల, డోన్, ఉద్దానం తదితర తాగునీటి పథకాల పనులు పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు పవన్ కల్యాణ్ చొరవతో 3,439 గ్రామీణ తాగునీటి పనుల క్రమబద్ధీకరణ, విస్తరణ నిమిత్తం రూ. 4,054 కోట్ల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో గ్రామీణ తాగునీటి పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఫిల్టర్ బెడ్లు దెబ్బతిని, నీటి నాణ్యత తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్య తీవ్రత, స్థానిక అవసరాలు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో వాటిని పునరుద్ధరించాలని అధికారులను పవన్ ఆదేశించారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు యుద్ధప్రాతిపదికన ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టారు. కృష్ణా జిల్లా, కంకిపాడు వేదికగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్లినపుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గుడివాడ నియోజకవర్గంలోని తాగునీటి సరఫరాలో ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే వివరించారు. ఈ అంశంపై తక్షణం స్పందించిన పవన్‌న్ ఆ నియోజకవర్గంలో తాగునీటి నాణ్యతపై క్షేత్రస్థాయి సర్వేకు ఆదేశాలు ఇచ్చారు. రూ. 3.80 కోట్లతో 40 ఫిల్టర్ బెడ్ల పునరుద్ధరణ ప్రక్రియ తక్షణం పూర్తి చేశారు. అలాగే, విజయనగరం జిల్లా గొర్ల గ్రామంలో అతిసారం ప్రబలినప్పుడు ఆ ప్రాంత పర్యటనలో భాగంగా తాగునీటి సరఫరాలో లోపాలను గుర్తించి, తక్షణ మరమ్మత్తులకు ఆదేశాలు ఇచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలన్న జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, సీఎం చంద్రబాబు సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు డిప్యూటీ సీఎం పవన్ చర్యలు చేపట్టారు.
ఈ వార్తలను కూడా చదవండి
సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరిగేనా...?