ఖరీఫ్ కష్టాలు
ABN , Publish Date - Jul 29 , 2024 | 11:35 PM
జిల్లాలో ఖరీఫ్ రైతులకు కూలీల కొరత వేధిస్తోంది. దీంతో సకాలంలో నాట్లు వేయలేకపోతున్నారు. మరోవైపు వ్యవసాయ ఖర్చులు అమాంతం పెరిగిపోవడంతో లబోదిబోమంటున్నారు.
తడిసిమోపెడవుతున్న వ్యవసాయ ఖర్చులు
వరుణుడు కరుణించినా.. సకాలంలో నాట్లు వేసుకోలేని పరిస్థితి..
అప్పులు చేసి.. పనులు చేపడుతున్న వైనం
పాలకొండ,జూలై 29: జిల్లాలో ఖరీఫ్ రైతులకు కూలీల కొరత వేధిస్తోంది. దీంతో సకాలంలో నాట్లు వేయలేకపోతున్నారు. మరోవైపు వ్యవసాయ ఖర్చులు అమాంతం పెరిగిపోవడంతో లబోదిబోమంటున్నారు. వాస్తవంగా జిల్లాలో 70 శాతానికి పైగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. ఈ ఏడాది వారు సుమారు రెండు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేపట్టనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు వారంతా ఖరీఫ్ పనులకు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటితో మరికొందరు నాట్లు వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ తరుణంలోనే వారికి కూలీల సమస్య వెంటాడుతుంది. చేసేదేమీ లేక కొంతమంది రైతులు అందుబాటులో ఉన్న కూలీలకు అధిక మొత్తాలను చెల్లించి వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు.
ఖర్చులు ఇలా..
కూలీల కొరత నేపథ్యంలో జిల్లా రైతులు అందుబాటులో ఉన్న వారితో వ్యవసాయ పనులు చేసేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఇదే అదునుగా కొందరు అధిక మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు కాంట్రాక్ట్ పద్ధతిలోనే వ్యవసాయ పనులు చేపడుతున్నారు. గతంలో ఎకరా వరినారు తీసేందుకు రూ.2,500 చెల్లించగా.. ప్రస్తుతం రూ.3,500 వరకు డిమాండ్ చేస్తున్నారు. నారును పొలంలో సర్దేందుకు ఎకరానికి రూ.500 తీసుకునే వారు ప్రస్తుతం రూ.1500 వరకు అడుగుతున్నారు. నాట్లు వేసేందుకు గతంలో ఎకరాకు రూ.2,500 వరకు చెల్లించగా.. ప్రస్తుతం రూ.3,500 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి.. వ్యవసాయ పనులు చేయిస్తున్నారు. పెట్టుబడులు భారీగా పెరిగిపోవడంతో కొందరు అప్పులు చేస్తున్నారు. మరికొందరు ఇంటిలో బంగారం ఆభరణాలను తనఖా పెట్టాల్సి వస్తోంది.
వలస బాటలో...
గతంలో పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలోని 15 మండలాల్లోనూ వేల సంఖ్యలో వ్యవసాయ కూలీలు ఉండేవారు. అయితే కాల క్రమంలో ఎంతోమంది వలసబాట పట్టారు. వ్యవసాయ పనుల ద్వారా శారీరక కష్టం తప్ప అనుకున్నస్థాయిలో కూలి కూడా గిట్టుబాటు కాకపోవడంతో అత్యధికులు వ్యవసాయ పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయేతర పనులు చేపట్టేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు భవన నిర్మాణ కార్మికులుగా, పరిశ్రమలు, కర్మాగారాల్లో నెలవారి వేతన కార్మికులుగా చేరుతున్నారు. దీంతో జిల్లాలో వ్యవసాయ పనులు చేసేందుకు కూలీల కొరత వేధిస్తుంది.
గత ప్రభుత్వం తీరుతో..
జిల్లాలో రైతుల సమస్యలను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఎరువులు, విత్తనాల విషయం పక్కన పెడితే.. వారికి అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా సబ్సిడీపై అందించలేకపోయింది. కొంతమంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కస్టమ్స్ హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయ యంత్రాలను పొందారు. గత టీడీపీ ప్రభుత్వం మాత్రం అన్నదాతలకు అవసరమైన యంత్ర పరికరాలను సబ్సిడీలకు అందించింది. దీంతో రైతాంగానికి కొంతమేర వ్యయ ప్రయాస తగ్గేది. కూలీల సమస్యను కూడా అధిగమించేవారు. అయితే వైసీపీ సర్కారు పాలనలో ఆ పరిస్థితి లేదు. ఐదేళ్లూ.. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇప్పుడు రైతులంతా నూతన ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. అవసరమైన యంత్ర పరికరాలను సబ్సిడీ ద్వారా అందించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.