భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన.. రైతు మృతి
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:43 AM
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గొరపూడిలో భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.
భూసేకరణను అడ్డుకున్న రైతులు
ఆందోళనలో పాల్గొన్న రైతు మృతి
మృతదేహంతో బంధువుల ఆందోళన
సీపీఎం నేతల అరెస్టు.. నిరసనగా రాస్తారోకో
రాంబిల్లి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా అధికారులు భూసేకరణకు సిద్ధపడటంతో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గొరపూడిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గొరపూడి పంచాయతీలో ఎస్‌ఈజడ్ ఫేజ్-2లో లారస్ ల్యాబ్స్‌కు కేటాయించిన 416 ఎకరాలకు అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టగా రైతులు, ప్రజాసంఘాల నేతలు అడ్డుకున్నారు. జిరాయితీ, డీపట్టా, సాగు భూములకు పరిహారం చెల్లించలేదని, పునరావాస కాలనీ నిర్మించకుండా, గ్రామాన్ని తరలించకుండా తమ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేస్తే వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. అయినప్పటికీ పనులు ఆపకపోవడంతో స్థానిక పెద్ద లాలం తాతబాబు రైతులను తీసుకుని హోంమంత్రిని కలిసేందుకు హుటాహుటిన విశాఖ వెళ్లారు. కాగా, భూసేకరణను నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్న రైతు నరసింహారావు అస్వస్థతకు గురై, ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మృతదేహంతో రహదారిపై బైఠాయించారు. మరోవైపు రైతుల ఆందోళనకు మద్దతుగా వెళ్లిన సీపీఎం నాయకులు ఆర్.శంకరరావు, జి.దేముడునాయుడు, వై.రాము, డి.కాశీయ్యలను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలనూ చదవండి: