Share News

90 శాతం సమస్యలపై సీఎం హామీ

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:21 AM

సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ అన్నారు. విజయవాడలోని ఎన్జీజీవో హోమ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు.

90 శాతం సమస్యలపై సీఎం హామీ

  • ప్రభుత్వానికి ధన్యవాదాలు.. ఉద్యమం హెచ్చరికతోనే చర్చలు

  • ఏపీజేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ వెల్లడి

  • ఉద్యమం వాయిదా: బొప్పరాజు

విజయవాడ(గాంధీనగర్‌), సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ అన్నారు. విజయవాడలోని ఎన్జీజీవో హోమ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ నెల 5లోగా ఉద్యోగుల సమస్యలపై చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నెల 3న చర్చలకు ఆహ్వానించిందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన 90 శాతం సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ‘‘పీఆర్సీ కమిషనర్‌ నియామకం, రెండు డీఏల విడుదల, ఒక సరెండర్‌ లీవ్‌ చెల్లిస్తామన్నారు. ఇవి 2021-22 నుంచి పెండింగ్‌లోని అంశాలు. పోలీసులకు అడిషనల్‌ సరెండర్‌ లీవ్‌ ఇస్తామన్నారు. హెల్త్‌కార్డు సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇవ్వడం వల్ల సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది. ఐఆర్‌పై మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలు, సీపీఎస్‌ తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం’’ అని విద్యాసాగర్‌ తెలిపారు. జేఏసీ సెక్రటరీ జనరల్‌ కేఎస్ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. మెమో 57ను అమలు చేయాలని కోరగా, అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారని తెలిపారు.


ఐఆర్‌పై స్పష్టత ఇవ్వాలి: బొప్పరాజు

ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు తీసుకున్న సానుకూల నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో బొప్పరాజు మాట్లాడుతూ.. ఐఆర్‌ ప్రకటించకపోవడం, బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం చంద్రబాబు చెప్పిన ప్రకారం ఉద్యోగులకు రావాల్సిన రూ.32 వేల కోట్ల బకాయిలపై రోడ్‌ మ్యాప్‌, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు తదితర 30 డిమాండ్లపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామన్నారు. సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ.. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. తాము అనుకున్న విధంగా కొన్ని ఆర్థికపరమైన అంశాలను సాధించలేకపోయినా.. ఇతర సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగులు స్వాగతించారని తెలిపారు.

ఈ వార్తలను కూడా చదవండి

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్‌

Updated Date - Sep 07 , 2026 | 04:21 AM