Share News

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:33 PM

మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం గ్రామంలో ఒక గిరిజన రైతు పొలంలో స్టార్‌ ఫ్రూట్స్‌ విరగ్గాశాయి.

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌
యర్రవరం గ్రామంలో విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

పండ్లలో మెండైన పోషకాలు

మార్కెట్‌లో కిలో రూ.90కు విక్రయం

చింతపల్లి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరం గ్రామంలో ఒక గిరిజన రైతు పొలంలో స్టార్‌ ఫ్రూట్స్‌ విరగ్గాశాయి. ఈ స్టార్‌ ఫ్రూట్స్‌ను చూసేందుకు, కొనుగోలు చేసేందుకు స్థానిక గిరిజనులు, మైదాన ప్రాంతీయులు ఆసక్తి చూపుతున్నారు. సుమారు 15 ఏళ్ల క్రితం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు స్టార్‌ ఫ్రూట్స్‌పై పరిశోధనలు నిర్వహించి గిరిజన ప్రాంతం సాగుకు అనుకూలమని నిర్ధారించారు. ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు సూచనలతో యర్రవరం గ్రామానికి చెందిన గూడెపు వేణుగోపాల్‌ రాజు నాలుగేళ్ల క్రితం కడియం నుంచి 20 స్టార్‌ ఫ్రూట్స్‌ మొక్కలు కొనుగోలు చేసి గ్రామానికి తీసుకొచ్చాడు. తన పంట పొలంలో నాట్లు వేశాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ ఏడాది ఒకేసారి ఎనిమిది మొక్కలు కాపుకొచ్చాయి. ఒక్కొక్క మొక్క నుంచి 20- 30 కిలోల దిగుబడులు వచ్చాయి. ఈస్టార్‌ ఫ్రూట్స్‌పై స్థానిక గిరిజనులకు పెద్దగా అవగాహనలేదు. దీంతో మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వేణుగోపాల్‌ రాజు నుంచి కిలో రూ.90 ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాగా స్టార్‌ ఫ్రూట్స్‌ను అంబటి కాయ అని పిలుస్తారని, దీని శాస్త్రీయ నామం ‘అవెర్రోవా కారంబోలా’ అని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అధిపతి డాక్టర్‌ వి.రమణ తెలిపారు. మలేషియా, ఇండోనేషియా, శ్రీలంకలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, మన దేశంలో అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, కేరళం, తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు. స్టార్‌ ప్రూట్‌ని ఆహారంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ప్రధానంగా విటమిన్‌-సీ పుష్కలంగా లభిస్తుందని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని రాంబిల్లి బీసీటీ కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్త సింగంపల్లి మీనాక్షి తెలిపారు. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుందన్నారు. గుండె ఆరోగ్యాన్ని, చర్మసౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ పండ్లను తీసుకోవడం మంచిదికాదని ఆమె సూచించారు.

Updated Date - Sep 06 , 2026 | 11:33 PM