Share News

కరెంటు వినియోగం ‘పీక్స్‌’!

ABN , Publish Date - Sep 07 , 2026 | 04:51 AM

రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం అన్ని రికార్డులనూ దాటేస్తోంది. వేసవిని మించి వినియోగం జరుగుతుండడంతో విద్యుత్‌ సంస్థలు డిమాండ్‌కు తగినట్లు కరెంటు సరఫరా చేయలేకపోతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు 295.58 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నెలకొనగా.. 283.40 మిలియన్‌ యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలిగాయి.

కరెంటు వినియోగం ‘పీక్స్‌’!

  • 295.58 మిలియన్‌ యూనిట్లకు చేరిన డిమాండ్‌

  • సరఫరా 283.40 మిలియన్‌ యూనిట్లే

  • శనివారం ఒక్కరోజే 12 మి.యూనిట్ల లోటు

  • డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయలేక

  • చేతులెత్తేస్తున్న విద్యుత్‌ సంస్థలు

  • కొన్నిచోట్ల అప్రకటిత కోతలు.. జనం విలవిల

  • బహిరంగ మార్కెట్లో పీక్‌ అవర్స్‌లో భారీ ధర

అమరావతి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం అన్ని రికార్డులనూ దాటేస్తోంది. వేసవిని మించి వినియోగం జరుగుతుండడంతో విద్యుత్‌ సంస్థలు డిమాండ్‌కు తగినట్లు కరెంటు సరఫరా చేయలేకపోతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు 295.58 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నెలకొనగా.. 283.40 మిలియన్‌ యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలిగాయి. అంటే ఒక్కరోజే 12.18 మిలియన్‌ యూనిట్ల లోటు ఏర్పడింది. అంతకు ముందురోజు కూడా ఇదే పరిస్థితి. 292.22 మిలియన్‌ యూనిట్లకు డిమాండ్‌కు గాను 282.79 మిలియన్‌ యూనిట్లనే విద్యుత్‌ సంస్థలు అందించగలిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్‌ కోతలు అనివార్యమవుతున్నాయి. కేంద్ర గ్రిడ్‌ నుంచి కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. పరిస్థితి అలాగే కొనసాగితే కేంద్ర గ్రిడ్‌ కూడా సరఫరాను నిలిపివేసే అవకాశం ఉండడంతో ఆదివారం నుంచి మనకు కేటాయించిన వరకే వాడుకుంటున్నారు. బహిరంగ మార్కెట్ల నుంచి శనివారం 41 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎండలు కూడా వేసవిని తలపిస్తున్నాయి. దీంతో వ్యవసాయ, ఆక్వా రంగాల్లో గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. గృహ, పారిశ్రామిక అవసరాలకూ ఎక్కువగానే డిమాండ్‌ ఉంటోంది. పరిస్థితిని చక్కదిద్దాలంటే.. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ఒక్కటే మార్గం. ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌ లేదా రియల్‌ టైమ్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేయాలి. పీక్‌ అవర్స్‌లో యూనిట్‌ ధర రూ.8 నుంచి 10 వరకు ఉంటోంది. ఇంత ధరపెట్టి కొనాలంటే డిస్కంలపై అదనపు భారమే.


ఈ వార్తలను కూడా చదవండి

భారత్ తన అవసరాల కోసమే.. మా చమురు కొంటోంది: రష్యా

తాగు నీటికే సిద్ధాపురం

Updated Date - Sep 07 , 2026 | 04:51 AM