అన్ని స్థాయిల్లోనూ..పొలిటికల్ గవర్నెన్స్!
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:04 AM
పరిపాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం అత్యంత కీలకమని, అన్ని స్థాయిల్లో పొలిటికల్ గవర్నెన్స్ సమర్థంగా అమలు కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం కీలకం
అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
అప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయ్
నియోజకవర్గాలవారీ విజన్ ప్లాన్
దేశంలో ఏపీలోనే ప్రథమం: సీఎం
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పరిపాలనలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం అత్యంత కీలకమని, అన్ని స్థాయిల్లో పొలిటికల్ గవర్నెన్స్ సమర్థంగా అమలు కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. పేదరిక నిర్మూలన, ప్రజాసమస్యల త్వరిత పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్‌ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక, ప్రణాళిక శాఖల ముఖ్యకార్యదర్శి పీయూ్‌షకుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్ట్‌నర్స్ పాల్గొన్నారు.
సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. నియోజకవర్గాలవారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని అమలు చేయడం దేశంలోనే ప్రథమంగా ఏపీలోనేనని తెలిపారు. దీనికి జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చిందన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్‌ను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని చెప్పారు. రూపొందించుకున్న కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లకు అనుగుణంగా ఆయా రంగాల్లో వృద్ధి నమోదు చేసేలా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్ట్‌నర్స్, స్వర్ణ కార్యాలయాల సిబ్బంది విన్నూతంగా ఆలోచించాలని.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, స్థానికంగా ఉండే వనరుల లభ్యతనుబట్టి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయడం, ప్రణాళికలను సిద్ధం చేయడం వంటి అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు డేటా లేక్ సిద్ధం చేశామని.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించుకోవాలని ఆదేశించారు. యాక్షన్ ప్లాన్ అమలుపై ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో సమీక్షలు మొక్కుబడిగా కాకుండా, ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉండేలా నిర్వహించాలని స్పష్టంచేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
సంప్రదాయ ధోరణి వద్దు..
క్షేత్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయ ధోరణి వీడి వినూత్నంగా ఆలోచించాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విజన్ ప్లాన్‌ను వర్తింపజేస్తూ సమస్యలకు పరిష్కారాలు చూపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్య, వైద్యం భారంగా మారుతున్నాయి. ఈ ఇబ్బందుల నుంచి వారిని గట్టెక్కించేందుకే సంజీవని, తల్లికి వందనం వంటి వినూత్న పథకాలను తెచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు పెంచడం వల్ల అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారు. ఉత్తరాంధ్ర ప్రజల కలల సాకారంగా చేపట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తే, వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారం చేపట్టారు. అదేవిధంగా యువతకు మేలు చేసేలా చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియకు అనేక అడ్డంకులు కల్పించే ప్రయత్నం జరిగినా సమర్థంగా నిర్వహించి రిక్రూట్‌మెంట్ పూర్తి చేశాం. పారదర్శకంగా చేపట్టిన డీఎస్సీపై విమర్శలు చేస్తుంటే.. టీచర్లే స్వయంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలను మెప్పించగలిగితే, వారి నుంచి సహకారం కూడా అదే స్థాయిలో ఉంటుంది.
సాధికారతే ప్రధాన లక్ష్యం..
లబ్ధిదారులకు నగదు సాయం అందించడమే కాకుండా.. వారిని ఆర్థికంగా నిలబెట్టి సాధికారత వైపు నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పెద్దఎత్తున అభివృద్ధి-సంక్షేమం చేపడుతున్నాం. వాటిని ప్రజలకు వివరించే బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. పీ-4 ప్రాజెక్టు ద్వారా పేదలకు చేయూత అందిస్తున్నాం. పేదరిక నిర్మూలనకు పారిశ్రామికవేత్తలను సైతం ప్రోత్సహిస్తూ, సమాజంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించాలి. అనుమతులు పొందుతున్న పరిశ్రమలు ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో గ్రౌండయ్యేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
పెళ్లి బృందానికి త్రుటిలో తప్పిన ప్రమాదం