సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం తగదు
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:20 AM
భూమి, ఆస్తిహక్కు వంటి సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. పౌరుల మధ్య ఉన్న స్థలవివాదాలు పరిష్కరించే...
నిర్ధారించే అధికారం పోలీసులకు లేనేలేదు
ఆ బాధ్యత సివిల్ కోర్టులు, చట్టబద్ధమైన ఫోరమ్‌లకు మాత్రమే ఉంటుంది: హైకోర్టు
అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): భూమి, ఆస్తిహక్కు వంటి సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. పౌరుల మధ్య ఉన్న స్థలవివాదాలు పరిష్కరించే, ఆస్తి హక్కును నిర్ధారించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. సివిల్‌కోర్టు, ఇతర చట్టబద్ధమైన ఫోరమ్‌ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో జోక్యం చేసుకుని, సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. శాంతి భద్రతలు, చట్ట ఉల్లంఘనలు చోటు చేసుకున్నప్పుడు మండల, డివిజన్, జిల్లాస్థాయి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలిచ్చే అధికారం ఉన్నప్పటికీ.. వివాదం సివిల్ కోర్టుకు చేరితే వారు తమ అధికారాన్ని వినియోగించరాదని గుర్తు చేసింది. పౌరుల మధ్య ఉండే ఆస్తి, హక్కుల వివాదాలను పరిష్కరించే బాధ్యత సివిల్ కోర్టులు, చట్టబద్ధమైన ఫోరమ్‌లకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. సివిల్ వివాదాల్లో ఎలా వ్యవహారించాలో పేర్కొంటూ గత అక్టోబరు 24న రాష్ట్ర డీజీపీ జారీచేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పోలీసులకు తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన పరిష్కారాల కోసం సంబంధిత సివిల్ కోర్టులు, ఇతర ఫోరమ్‌లను ఆశ్రయించే అంశాన్ని బాధిత పక్షాలకే వదిలేస్తున్నామని పేర్కొంది. ప్రస్తుత కేసుల్లో పిటిషనర్లు కాగ్నిజబుల్ నేరాలను పాల్పడినట్లు ఆధారాలు ఉంటే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. తమ భూములు, ఆస్తుల పంపకాలకు సంబంధించి వివాదాలు సివిల్ కోర్టులో విచారణకు ఉన్నప్పటికీ, పోలీసులు స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై కోర్టు తుది విచారణ జరిపి నిర్ణయం వెల్లడించింది. ‘నేరాలను నియంత్రించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, పౌరుల ప్రాణాలు, ఆస్తులు కాపాడడం పోలీసుల ప్రాథమిక విధి. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకొని రికవరీలు, ఆస్తులు ఖాళీ చేయించడం వంటివి చేసే అధికారం వారికి లేదు. ఐక్యరాజ్యసమితి సిఫారసు ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాకు 222 మంది పోలీసులు ఉండాలి. ఏపీలో ఆ నిష్పత్తి 166.18గా ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే.. కొంతమంది పోలీసు అధికారులు అక్రమంగా లాభపడటం తప్ప మరొకటి కాదు. పోలీసుల ఆలోచన, పనితీరు వలసవాద వైఖరినే ప్రతిబింబిస్తున్నాయి. ఆధిపత్య ధోరణికి స్వస్తి పలికి, ప్రజలకు జావాబుదారీగా ఉండే ప్రజాస్వామ్య పోలీసింగ్ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి: