పీజీ వైద్య విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:24 AM
పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు.
వారంలో విధులు 74 గంటలు దాటొద్దు
కళాశాలలు, బోధనాస్పత్రులకు డీఎంఈ ఆదేశాలు
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు. ఈ మేరకు వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్య కాలేజీలు, బోధనాస్పత్రుల్లో పీజీ విద్యార్థులకు విధులు, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు వారానికి 74గంటలకు మించి విధులు కేటాయించవద్దని తెలిపారు. ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒకరోజు పూర్తిస్థాయి సెలవు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అలాగే ప్రతి విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్, అంతకంటే పైస్థాయి అధికారిని పీజీ రిజిస్ట్రార్‌గా నియమించాలని, డ్యూటీ రోస్టర్లను హెచ్‌వోడీ,. పీజీ రిజిస్ట్రార్, ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్ల సమన్వయంతో రూపొందించాలని సూచించారు. ప్రతి కళాశాలలో నోడల్ అధికారిని నియమించి నెలవారీ నివేదికలను 10వ తేదీలోపు డీఎంఈ కార్యాలయానికి పంపాలని తెలిపారు. జూనియర్ వైద్యులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు, హెచ్‌వోడీలపై చర్యలు తీసుకుంటామని డీఎంఈ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్