Share News

రైలెక్కిన జవాన్‌.. ఆ తర్వాత అదృశ్యం

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:37 AM

దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఓ ఆర్మీ జవాన్‌ స్వగ్రామానికి వస్తూ అదృశ్యమవడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తోటల చెరువుపల్లికి చెందిన పగడాల రవి 19 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 రైలెక్కిన జవాన్‌.. ఆ తర్వాత అదృశ్యం
Jawan Ravi

19 రోజులుగా కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు

వరికుంటపాడు: దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఓ ఆర్మీ జవాన్‌ స్వగ్రామానికి వస్తూ అదృశ్యమవడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తోటల చెరువుపల్లికి చెందిన పగడాల రవి 19 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రవి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రవి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తోటల చెరువుపల్లికి చెందిన పగడాల రవి 2008లో ఇండియన్‌ ఆర్మీలో చేరారు.


ప్రస్తుతం ఇంపాల్‌లోని దిమాపూర్‌ రెజ్‌మెంట్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనకు జమ్మూ-కశ్మీర్‌కు బదిలీ కావడంతో కొత్త పోస్టింగ్‌కు వెళ్లే ముందు 21 రోజులపాటు సెలవు మంజూరైంది. దీంతో రవి పశ్చిమ బెంగాల్‌లోని న్యూజల్పాయిగురి రైల్వే స్టేషన్‌ నుంచి గత జులై 19 మధ్యాహ్నం 3.40 గంటలకు రైలు ఎక్కారు. రైలు ఎక్కే ముందు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ తర్వాత నుంచి రవి అందుబాటులో లేరని.. ఫోన్‌ చేసినా స్పందన లేదని.. వరుసగా మూడు రోజులు ఫోన్‌ రింగ్‌ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.


చివరి సారిగా రవి ఫోన్‌ సిగ్నల్‌ ఒడిశా రాష్ట్రంలోని భద్రక్‌ ప్రాంతంలో నమోదైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. రైలులో ప్రయాణిస్తున్న ఆర్మీ జవాన్‌ ఒక్కసారిగా అదృశ్యం కావడం వెనుక ఉన్న కారణం ఏమిటనేది తమకు అంతుబట్టడం లేదని వారు వాపోతున్నారు.


కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వరికుంటపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రవి తండ్రి చిన మాలకొండయ్య కూడా ఆర్మీలో పని చేస్తూ రిటైరయ్యారు. పదేళ్ల క్రితం ఆయన మృతి చెందారు. రవికి తల్లి కొండమ్మ, భార్య వరలక్ష్మితోపాటు పిల్లలు అమర్‌నాథ్ (8వ తరగతి), కుమార్తె మనస్వి (6వ తరగతి) ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మగ్గం తొక్కి.. పిల్లాడిని ముద్దాడి.. చేనేత కుటుంబాలతో సరదాగా!

పుష్పవతి కలనెరవేరింది..90 ఏళ్ల వృద్ధురాలితో ఫొటో దిగిన సీఎం

For More AP News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 07:43 AM