స్థానికంలోనూ సత్తా
ABN , Publish Date - Aug 29 , 2026 | 02:56 AM
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీ అధినేతకు ఇష్టం లేదని, అందుకే వాటిని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
కూటమి ఘన విజయం సాధించాలి
మూడు పార్టీల కార్యకర్తలూ ఐక్యంగా ఉండాలి: సీఎం
ఎన్నికలు జరగడం జగన్‌కు ఇష్టం లేదు
వాయిదాపడితే వైసీపీకి మేలనుకుంటున్నారు
అందుకే అడ్డుకునేందుకు ప్రయత్నాలు
సర్ ప్రక్రియపై కోర్టుకు కూడా వెళ్లారు
ఒక నాయకుడి వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకెళ్లింది ఏపీలోనే
2న పోలవరం ఎడమ కాలువ నుంచి నీరు
మాటిచ్చి మార్కాపురం జిల్లా ఏర్పాటు
ఇప్పుడు కానుకగా వెలిగొండ: చంద్రబాబు
టీడీపీ యూనిట్ ఇన్‌చార్జుల శిక్షణకు హాజరు
ప్రజలతో మంచిగా ఉంటే డబ్బుతో సంబంధం లేకుండా గెలిపిస్తారు. సఖ్యత లేనివారు ఎంత ఖర్చు చేసినా గెలవలేరు. కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీ అధినేతకు ఇష్టం లేదని, అందుకే వాటిని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించాలని.. ప్రతి బూత్, యూనిట్, క్లస్టర్ పరిధిలో టీడీపీని బలోపేతం చేయాలని ఆదేశించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు.. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఐక్యంగా ఉండాలని పిలుపిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ యూనిట్ ఇన్‌చార్జుల శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. శుక్రవారం నిర్వహించిన తరగతి 50వది కావడంతో చంద్రబాబు చేతుల మీదుగా ట్రైనర్లకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం యూనిట్ ఇన్‌చార్జులతో ఆయన ‘కాఫీ కబుర్లు’ నిర్వహించారు. విలేకరులతో కూడా మాట్లాడారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం లేదా వీలైనంత ఎక్కువ కాలం అవి వాయిదా పడేలా చూడడమే లక్ష్యంగా వైసీపీ వాళ్లు పనిచేస్తున్నారని.. ఎక్కువ కాలం వాయిదా వేయించగలిగితే అధికార పార్టీకి నష్టం జరిగి తమకు మేలు జరుగుతుందనే దింపుడు కళ్లెం ఆశతో జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘సర్’ ప్రక్రియపై గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లిందని, ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. ‘సర్’ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ప్రకటించినా.. అది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని స్పష్టంచేశారు. చంద్రబాబు ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
సొంతంగా పేపర్, చానల్ పెట్టుకున్న పార్టీ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. మీడియాను అడ్డం పెట్టుకుని గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు తిప్పికొట్టాలి. నేరాలు చేయడం, చేయించడం గొడ్డలి పార్టీ నైజం. తాము చేయించిన నేరాలు తమ మెడకు చుట్టుకుంటాయని భావిస్తే.. సొంతవారినైనా అంతం చేయడానికి ఆ పార్టీ వెనుకాడదు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలను బెదిరించి సొంత కంపెనీలో పెట్టుబడులు పెట్టించిన ఘనత గొడ్డలి పార్టీది. ఆ పార్టీ అధినేత వల్లే అధికారులు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారు. దేశ చరిత్రలో ఓ నాయకుడి వల్ల జైళ్లకు వెళ్లిన ఉదంతాలు లేవు. ఒక్క ఏపీలోనే ఇలా జరిగింది.
మొదటి దశలో అనకాపల్లికి నీరు..
సెప్టెంబరు 2న పోలవరం ఎడమ కాలువకు నీరు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. మొదటి దశలో అనకాపల్లి వరకు నీరిస్తాం. వచ్చే ఏడాది రెండో దశలో విశాఖ వరకు తరలిస్తాం. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే. 31న ప్రారంభించబోతోందీ నేనే. ఉమ్మడి ప్రకాశం జిల్లావాసులకు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటుతోపాటు వెలిగొండ ప్రాజెక్టునూ పూర్తి చేసి కానుకగా ఇస్తున్నాం. ఈ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్‌గానూ తీర్చిదిద్దుతాం.
టీడీపీ ఓ కర్మాగారం..
తెలుగుదేశం పార్టీ.. నాయకులు, కార్యకర్తలను తయారుచేసే కర్మాగారం. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారానే పార్టీ విలువలు, సిద్ధాంతాలను కొత్త తరం నాయకులకు అందించగలుగుతాం. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరూ సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి. ఎప్పటికప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి. కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ టీడీపీ ఒక్కటే. యువత ఆలోచనలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. భవిష్యత్‌లో వారే కీలకం కానున్నారు. పదవులు తీసుకుని పనిచేయని వారి స్థానంలో వేరేవారిని నియమిస్తాం.
34 శాతం కోటా బీసీలకు చట్టపరంగా రక్షణ కల్పించే ప్రయత్నమే. గత ఎన్నికల్లో వారికి ఎక్కువ స్థానాలే కేటాయించాం. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించిందే టీడీపీ.- సీఎం
ఈ వార్తలు కూడా చదవండి...
సోనియా గాంధీ ఆత్మకథ ప్రచురణపై వివాదం..
ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం