ఏసీబీ వలలో ఎంవీఐ
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:15 AM
రవాణా శాఖలోని ఓ అవినీతి తిమింగలం గుట్టును ఏసీబీ బృందం రట్టు చేసింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం అర్ధరాత్రి తనిఖీల పేరుతో వాహనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్న ఎంవీఐ గోపీనాయక్‌తోపాటు ఇద్దరు హోంగార్డులను అదుపులోకి తీసుకున్నారు.
వాహన తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లు
కావలి టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచి పట్టుకున్న అధికారులు
రూ.2,48,800 నగదు స్వాధీనం
ఎంవీఐతోపాటు మరో ఇద్దరు హోంగార్డులు అదుపులోకి
కావలి/కావలి రూరల్/నెల్లూరు (క్రైం), సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎంవీఐ నుంచి రూ.2,48,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ పి. రామకృష్ణుడు తెలిపిన వివరాలు..బనావత్ గోపీనాయక్ రవాణాశాఖ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌లో ఎంవీఐగా నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీల పేరుతో అక్రమంగా నగదు వసూలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారుల బృందం ప్రత్యేక నిఘా ఉంచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేటు బస్సులను తనిఖీలు చేయాలని ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు కొద్దిరోజులుగా జిల్లాలోని టోల్‌ప్లాజాల వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. శనివారం రాత్రి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద గోపీనాయక్‌తోపాటు మరో ఏఎంవీఐని తనిఖీ అధికారులుగా నియమించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేయవలసిన గోపీనాయక్ ఇతర వాహనాలను కూడా ఆపి వసూళ్లకు పాల్పడ్డారు. అప్పటికే ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, సీఐ ఆయనపై నిఘా ఉంచారు. వాహనదారుల నుంచి ఎంవీఐ నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి రూ.68,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే గోపీనాయక్‌కు చెదిన కారును తనిఖీ చేసి, డిక్కీలో రూ.1.8 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు హోంగార్డులు చలం, శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలను కూడా చదవండి