Share News

మాజీ సీఎం భాస్కరరావు మృతికి సంతాపం తెలిపిన ఏపీ మంత్రులు

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:32 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఏపీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మాజీ సీఎం భాస్కరరావు మృతికి సంతాపం తెలిపిన ఏపీ మంత్రులు
Nandendla Bhaskar Rao

అమరావతి, ఏప్రిల్ 22: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(90) కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ(బుధవారం) తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు సంతాపం ప్రకటించారు. నాదెండ్ల భాస్కరావు మృతి పట్ల మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మంత్రి కందుల దుర్గేశ్

'భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు. ఎంతోమంది నేతలకు రాజకీయ ఓనమాలు నేర్పిన గొప్ప మార్గదర్శి నాదెండ్ల భాస్కర్ రావు. ప్రజా ప్రతినిధిగా భాస్కరరావు చేసిన సేవలు చిరస్మరణీయం. 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వల్పకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, అంతకుముందు మంత్రిగా ఆయనకు పరిపాలనపై గట్టి పట్టు ఉండేది. చట్టసభల పనితీరుపై ఆయనకు అపారమైన అవగాహన ఉంది. గుంటూరు జిల్లా నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు' అని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.


అనేక మందికి గొప్ప మార్గదర్శి భాస్కరరావు: హోం మంత్రి

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతికి హోం మంత్రి అనిత సంతాపం తెలిపారు. సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ తన తండ్రిని కోల్పోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని దేవుడిని ఆకాంక్షించారు. అనేకమంది నాయకులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన గొప్ప మార్గదర్శిగా భాస్కరరావుని ఆమె తెలిపారు. నాదెండ్ల భాస్కరావు కుటుంబ సభ్యులకు మంత్రి అనిత తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


భాస్కరరావు జీవితం తరతరాలకు ఆదర్శం: మంత్రి అచ్చెన్నాయుడు

అలానే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో నైతిక విలువలు, క్రమశిక్షణకు ప్రతీకగా ఆయన జీవితం తరతరాలకు ఆదర్శమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సాధారణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప ప్రజానాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. అనేకమంది నాయకులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన గొప్ప మార్గదర్శిగా భాస్కరరావుని మంత్రి స్మరించారు. 1980వ దశకంలో టీడీపీ ఆవిర్భావంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుర్తుచేసుకున్నారు.


భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలి: మంత్రి సవిత

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతిపై మంత్రి సవిత సంతాపం తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి సవిత ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం

అమరావతి పనులకు వేగంగ ఇసుక, కంకర

Updated Date - Apr 22 , 2026 | 03:59 PM