అమరావతి పనులకు వేగంగ ఇసుక, కంకర
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:17 AM
ఏమాత్రం జాప్యం లేకుండా రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల కోసం ఉపయోగించే ఇసుక, కంకర, ఎర్రమట్టి తదితర ఖనిజాల సరఫరాకు పాలనాపరమైన అనుమతులు...
వారంలోనే ఖనిజాల తవ్వకం, సరఫరాకు అనుమతులు
నిబంధనలు సులభతరం చేస్తూ గనుల శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఏమాత్రం జాప్యం లేకుండా రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల కోసం ఉపయోగించే ఇసుక, కంకర, ఎర్రమట్టి తదితర ఖనిజాల సరఫరాకు పాలనాపరమైన అనుమతులు వేగంగా అందించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ సంస్థలు ఆ ఖనిజాల తవ్వకం, సరఫరా కోసం దరఖాస్తుచేసిన తర్వాత గరిష్ఠంగా వారం రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చేలా నిబంధనలను సులభతరం చేస్తూ గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు (జీఓ 84) జారీ చేశారు. గతంలో అంటే 2016-17లో ఖనిజాల అనుమతుల కోసం నిర్దేశించిన గడువు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఆ ఉత్తర్వులే అమల్లో ఉండటం వల్ల అమరావతి నిర్మాణంలో పాలుపంచుకొంటున్న కంపెనీలు ఇసుక, కంకర, ఎర్రమట్టి తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే అన్నిరకాల అనుమతులు, ఎన్‌ఓసీలు ఇవ్వడానికి కనీసం మూడు నుంచి ఐదు నెలల సమయం పడుతోంది. దీంతో సకాలంలో మెటీరియల్ అందక నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. దీన్ని గుర్తించి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమైన కంపెనీలు ఖనిజాల అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ముఖేశ్‌కుమార్ మీనా రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. ఇందులో ఖనిజాల తవ్వకం, రవాణా అనుమతుల్లో నెలకొంటున్న జాప్యాన్ని నివారించాలని వారు కూడా కోరారు. అనుమతులను సులభతరం చేసే అంశంపై గనుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి నూతన విధివిధానాలు రూపొందించారు.
ఇకపై వేగంగా అనుమతులు
ఎర్రమట్టి, రోడ్‌మెటల్, ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకం, రవాణా కోరుతూ నిర్మాణ సంస్థల నుంచి వచ్చే దరఖాస్తులను కనీసం 15 రోజుల్లోగా జిల్లా గనుల సహాయక అధికారి పరిశీలించే గడువు ఉండేది. దాన్ని 2 రోజులకే కుదించారు.
మైనింగ్ దరఖాస్తు రాగానే, అది ఏ ప్రాంతం పరిధిలోకి వస్తుందో చూసి సంబంధిత తహశీల్దార్‌కు ఒక్క రోజులోనే పంపించాలి.
నిరభ్యంతర పత్రం జారీకి అవసరమైన నివేదికను తహశీల్దార్ కేవలం3రోజుల్లోనే గనుల శాఖకు పంపించాలి. ఇంతకు ముందు 20 రోజుల గడువు ఉండేది.
మైనింగ్ దరఖాస్తుపై సర్వే, తనిఖీ నివేదికను 3రోజుల్లో, డీఎంజీఓస్థాయిలో ప్రాసెసింగ్‌కు మరో3 రోజుల గడవు ఇచ్చారు.
జిల్లా ఏడీ, డీడీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి 3 రోజుల్లోనే మైనింగ్‌కు సిఫారసు చేయాలి. ఆ తర్వాత మైనింగ్‌ప్లాన్‌ను వారం రోజుల్లోనే ఆమోదించాలి. ఇక రాష్ట్ర స్థాయిలో ఇచ్చే ఎన్‌ఓసీని 5 రోజుల్లో, మైనింగ్ ఆర్డర్‌ను 2 రోజుల్లోనే ఇవ్వాలని ప్రభుత్వం కొత్త గడువు నిర్దేశించింది. అంటే, ఏ స్థాయిలోనైనా దరఖాస్తులు వారం రోజుల్లోపే పూర్తి కావాలి. మండల, జిల్లా స్థాయిలో గరిష్ఠంగా మూడు రోజులకు మించి దరఖాస్తును అట్టిపెట్టుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దిశగా గనుల శాఖ డైరెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.