కర్ణాటకలో దారుణం.. అమెరికా మహిళపై అత్యాచారం..
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:34 PM
భారతదేశంలో అమెరికా మహిళపై అత్యాచారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కర్ణాటక రాష్ట్రం కుట్టాలో ఓ హోమ్‌స్టేలో ఉండగా తనపై లైంగిక దాడి జరిగిందని సదరు మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.
కర్ణాటక: భారతదేశంలో అమెరికా మహిళపై అత్యాచారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కొడగులోని కుట్టాలో ఓ హోమ్‌స్టేలో ఉండగా తనపై లైంగిక దాడి జరిగిందని సదరు మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కుట్టా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విదేశీయురాలిపై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగిందంటే..
అమెరికాకు చెందిన మహిళ కర్ణాటకలో పర్యటిస్తోంది. కొడగులోని కుట్టా గ్రామానికి చేరుకున్న ఆమె ఓ హోమ్‌స్టేలో దిగారు. అక్కడే జార్ఖండ్‌కు చెందిన వృజేష్ కుమార్ పని చేస్తున్నాడు. ఓ రాత్రి వేళ విదేశీయురాలిపై అతను అత్యాచారానికి ఒడికట్టాడు. ఈ విషయాన్ని హోమ్‌స్టే యజమానికి బాధితురాలు చెప్పగా అతనూ వృజేష్‌కే సహకరించాడు. ఈ విషయం బయటకు రాకుండా.. ఆమె ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా హోమ్‌స్టే యజమాని నిందితుడికి సహాయం చేశాడు. మూడు రోజులపాటు అతను వైఫై సేవలు నిలిపివేసి, బాధితురాలు ఎవరినీ సంప్రదించకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత తాను మైసూరు వెళ్తున్నానని చెప్పి మహిళ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. నేరుగా అమెరికా రాయబార కార్యాలయానికి చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యాన్ని అధికారులకు తెలియజేసింది.
సదరు అధికారులు వెంటనే మైసూర్ పోలీసులను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుట్టా పోలీస్ స్టేషన్‌లో అత్యాచారంపై కేసు నమోదు అయ్యింది. హోమ్‌స్టే వద్దకు చేరుకున్న పోలీసులు వృజేష్ కుమార్, అతనికి సహకరించిన యజమానిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. మే 3 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువుపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతిథులను గౌరవించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హితవుపలుకుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. ప్రధాని మోదీ ట్వీట్..
పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. భారత్‌కు అంతర్జాతీయ సమాజం బాసట