Share News

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం.. 37 అంశాలపై చర్చ

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:42 PM

దుర్గగుడి పాలకమండలి సమావేశంలో ప్రధానంగా 37 అంశాలపై చర్చ జరిగింది. ఆలయంతో పాటు క్యూలైన్లలోనూ భక్తుల కోసం టీవీలు పెట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు.

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం.. 37 అంశాలపై చర్చ
Durgamma Temple

విజయవాడ, ఏప్రిల్ 13: దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 37 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు కల్పించాల్సిన మెరుగైన సౌకర్యాలపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఆలయంతో పాటు క్యూలైన్లలోనూ భక్తుల కోసం టీవీలు పెట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు. టీవీలు ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యరీత్యా ఓ హాస్పిటల్‌తో ఎంవోయూ చేసుకోబోతున్నామని చెప్పారు.


కనకదుర్గానగర్‌లో మరుగుదొడ్లు గంజాయి బ్యాచ్ వాడుతున్నారని తెలిసిందని.. ఇకపై అలా ‌జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. అమ్మవారికి 234 ఎకరాలు ఉన్నాయని... కొన్ని చోట్ల కౌలు జరగడం లేదని.. మరికొన్ని చోట్ల అన్యాక్రాంతమైనట్లు గుర్తించామన్నారు. వాటిపైన ఏం చేయాలనే అంశంపై చర్చించామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ పేర్కొన్నారు.


అన్నివిధాలుగా దుర్గగుడి అభివృద్ధి: ఈవో

ఇంద్రకీలాద్రిపై భక్తులకు క్యూలైన్లలో ఇబ్బందులు తెలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామని ఈవో శీనానాయక్ తెలిపారు. దుర్గగుడి అన్నివిధాలా అభివృద్ధి చెందాలన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూములను కౌలుకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. జూన్ నాటికి లడ్డూపోటు, అన్నదానం ప్రారంభిస్తామన్నారు. మాస్టర్ ప్లా‌‌న్‌కు అనుగుణంగానే‌ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈవో శీనానాయక్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

జగన్, సజ్జల ప్రజల జీవితాలతో చెలగాటమాడారు: హనుమంతరావు

పట్టణ ప్రాంతాల్లో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 04:46 PM