Share News

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:25 AM

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.

ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం!
Vijayasai Reddy

అమరావతి, జనవరి 22: ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ బృందం.. రూ.3500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో జరిగిన అవకతవకలపై మాజీ ఎంపీని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించడం, హవాలా, షెల్ కంపెనీలపై ఈడీ ఆరా తీస్తోంది. డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు రూపకంగా ఎందుకు వసూలు చేశారని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం పాలసీ రూపకల్పనపై మూడు సార్లు తన సమక్షంలోనే సిట్టింగ్‌లు జరిగాయని.. కానీ ఈ పాలసీతో తనకు సబంధం లేదని విజయసాయి రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. విధాన నిర్ణయాల నుంచి రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.


కాగా.. ఈ కేసుకు సంబంధించి ఏపీ సిట్ అధికారులు దర్యాప్తు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ స్కామ్‌లో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని, షెల్ కంపెనీలకు అక్రమంగా నగదు తరలించారని, హైదరాబాద్‌ కేంద్రంగా మద్యం రూపకల్పన, భారీ స్థాయిలో అవినీతి జరిగిందని సిట్ గుర్తించింది. అయితే.. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని ఈడీ భావించింది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డికి నోటీసులు పంపిన ఈడీ.. వ్యక్తిగతంగా నేడు విచారణకు రావాల్సిందిగా పేర్కొంది.


ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా పలువురు భావిస్తుండగా.. దాదాపు రూ.3,500 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లు ఏపీ సిట్ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ముడుపులు, మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు, అవినీతి జరిగిందని సిట్ గుర్తించింది. ముడుపుల ద్వారా వచ్చిన నగదును షెల్ కంపెనీలకు అక్రమంగా బదిలీ చేశారని.. విదేశీ అకౌంట్లకు జమయ్యిందనే అభియోగాలు, ఆరోపణల నేపథ్యంలో దీనిపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విజయసాయి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.


ఇవి కూడా చదవండి...

ఏడాదిన్నర తర్వాత బయటికొస్తా..!

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 12:18 PM