రాష్ట్రంలో ఇజ్రాయెల్ పారిశ్రామిక క్లస్టర్
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:31 AM
రాష్ట్రంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
దావోస్ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రతిపాదన
ఆ దేశ వాణిజ్య మంత్రితో సమావేశం
సానుకూలంగా స్పందించిన ఇజ్రాయెల్
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. దావోస్ ఆర్థిక సదస్సులో మూడో రోజు బుధవారం ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్ బర్కత్, ఈ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, ట్రేడ్ మిషన్ ప్రతినిధి షిర్ స్లట్జ్కీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం, సువిశాల సముద్రతీర ప్రాంతం, అందుబాటులో ఉన్న ఓడరేవులు, విమానాశ్రయాలు, యువతలో సాంకేతిక పరిజ్ఞానం, సహజ వనరులు వంటి అంశాల గురించి ఇజ్రాయెల్ మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో యూఏవీ డ్రోన్ తయారీ, తీర ప్రాంత గస్తీ, వ్యవసాయ రంగంలో వినియోగానికి డ్రోన్ల తయారీ సాంకేతికతపై చర్చలు జరిగాయి. డీశాలినేషన్, పారిశ్రామిక అవసరాల కోసం వ్యర్థ జలాల రీసైక్లింగ్, సాంకేతికతపై సహకారం అందించడంపైనా చర్చించుకున్నారు. జపాన్, కొరియా పారిశ్రామిక క్లస్టర్ల తరహాలో ఇజ్రాయెల్ కూడా రాష్ట్రంలో ఒక పారిశ్రామిక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ఆ దేశ మంత్రి బర్కత్‌ను చంద్రబాబు కోరారు. ఈ ప్రతిపాదన పట్ల బర్కత్ సానుకూలంగా స్పందించారు. కట్టుదిట్టమైన సైబర్ సెక్యూరిటీ నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఇజ్రాయెల్ సాంకేతిక సహకారం అందించడంపైనా చర్చ జరిగింది. సాంకేతిక సహకారం అందించడానికి ఇజ్రాయెల్ మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు.
యూఏఈ విదేశీ, వాణిజ్య మంత్రితో భేటీ
ఏపీలో దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యూఏఈ విదేశీ, వాణిజ్య మంత్రి థాని బిన్ అహ్మద్ సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ పలు అంశాలపై చర్చించారు. అగ్రిటెక్, ఫుడ్ టెక్, ఆక్వా టెక్‌తో పాటు ఫుడ్ పార్కులు, ఎయిర్ పోర్టులు, రోడ్డు, రైలు నెట్‌వర్క్ ఏపీలో విస్తృతంగా ఉన్నాయని చంద్రబాబు వివరించారు. వీటితో పాటు జాతీయ పారిశ్రామిక కారిడార్లు కూడా రాష్ట్రంతో అనుసంధానమై ఉన్నాయని వివరించారు. యూఏఈకి చెందిన డీపీ వరల్డ్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్, ఏడీపోర్ట్స్, యాడ్‌నాక్ లాంటి కంపెనీలు ఏపీలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని కోరారు. యూఏఈ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలున్నాయన్నారు. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. యూఏఈకి చెందిన లాక్వా, మజ్జార్ లాంటి కంపెనీలతో పాటు ఏడీబీఏ, ముబాద్దా, ఏడిక్యూ లాంటి ఫండింగ్ సంస్థల ద్వారా పెట్టుబడులకు అవకాశాలున్నాయని వివరించారు. స్పేస్, డ్రోన్ సిటీల్లో యూఏఈ భాగస్వామ్యం వహించాలని కోరారు.
చంద్రబాబుతో స్విట్జర్లాండ్ బృందం భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఆ దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెన్ బడ్లిగర్ ఆర్టిడా, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి అంబాసిడర్ ఆండ్రియా రోలర్, స్విస్ పార్లమెంటు సభ్యుడు నిక్ గగ్గర్ చర్చలు జరిపారు. ఏపీ-స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలు, ఏపీలో స్విస్ కంపెనీల కార్యకలాపాలు, విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. కాగా ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇన్‌షియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మండ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. స్టార్ట్‌పలను ప్రోత్సహించడంతోపాటు యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలను అందిస్తూ ఏఐ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటుచేసేలా ఏపీ ప్రభుత్వంతో కలసి పని చేస్తున్నట్లు కాలిస్టా రెడ్మండ్ తెలిపారు. అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ వర్సిటీ ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే ఏపీతో ఒప్పందం చేసుకున్నట్లు కాలిస్టా తెలిపారు.
నేను ఆశావాదిని. భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటికోసం నిరంతరం పనిచేయడం నా అలవాటు. ముందు చూపుతో వ్యవహరించి, వినూత్నంగా ఆలోచించి, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని నమ్ముతా. యువతకు నేను ఇదే చెబుతా. ఆ దిశగా ప్రోత్సహిస్తా.
మాది పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నెన్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సకు పాలనను మార్చేశాం. పెట్టుబడులతో ముందుకు వచ్చినవారికి తక్షణమే అనుమతులు ఇస్తున్నాం. పరిశ్రమలకు ఎస్ర్కో ఖాతా ద్వారా నేరుగా ప్రోత్సాహకాలను అందజేస్తున్నాం. అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన దాకా ప్రతి అంశాన్ని రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నాం.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక రంగం ఇప్పుడు ఏపీ గురించి చర్చిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఏపీలో ఉత్పత్తికి అడుగులు వేశాం. అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమలను స్థాపిస్తున్నాం. విదేశాలకు గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేసేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం.
- దావోస్ సదస్సులో అంతర్జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు