Book Festival In Vijayawada: మంచి పుస్తకాలు ఆదరిస్తేనే.. మంచి రచయితలు వెలుగులోకి: వెంకయ్య నాయుడు
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:06 PM
ప్రముఖ రచయిత, జర్నలిస్టు, అన్నింటికీ మించి గొప్ప జాతీయవాది రామ్ మాధవ్ రచించిన మన రాజ్యాంగం- మన ఆత్మగౌరవం, ‘ముక్కలైన స్వాతంత్ర్యం’ పుస్తకాలను తాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాలను చదవాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ, జనవరి 04: మంచి పుస్తకాలు ఆదరించినప్పుడే.. మంచి రచయితలు వెలుగులోకి వస్తారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ రచించిన రెండు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత, జర్నలిస్టు, అన్నింటికీ మించి గొప్ప జాతీయవాది రామ్ మాధవ్ రచించిన మన రాజ్యాంగం- మన ఆత్మగౌరవం, ‘ముక్కలైన స్వాతంత్ర్యం’ పుస్తకాలను తాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.
జాతీయవాద మేధావిగా ఆయన చేస్తున్న కృషి, నిరంతర పరిశోధన అభినందనీయమన్నారు. మన రాజ్యాంగం- మన ఆత్మగౌరవం’ పుస్తకంలో రాజ్యాంగ పరిషత్ చర్చలు, బీఆర్ అంబేడ్కర్ కృషి, రాజ్యాంగ మౌలిక స్వభావం తదితర అంశాలను ఆయన లోతుగా చర్చించారని వివరించారు. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగం ఎలా దుర్వినియోగం అయ్యిందో వివరిస్తూ.. యువత తమ హక్కులతో పాటు బాధ్యతలనూ గుర్తుంచుకోవాలని ఈ పుస్తకంలో రామ్ మాధవ్ సూచించారని వెంకయ్య నాయుడు తెలిపారు.
‘ముక్కలైన స్వాతంత్ర్యం’ పుస్తకంలో బ్రిటీష్ వలస పాలకుల కుతంత్రాలు, కుహానా చరిత్రకారులు దాచిన వాస్తవాలతోపాటు ముస్లిం లీగ్ వల్ల జరిగిన నరమేధం వంటి చారిత్రక సత్యాలను రామ్ మాధవ్ వెలుగులోకి తెచ్చారని వివరించారు. మన అసలు చరిత్రను వక్రీకరించకుండా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి పుస్తకమని అభివర్ణించారు. ఈ రెండు పుస్తకాలను అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాలని.. మరీ ముఖ్యంగా యువతరం తప్పనిసరిగా వీటిని చదవాలని సూచించారు. పుస్తకం మన మస్తిష్కాన్ని చైతన్యవంతం చేస్తుందన్నారు. డిజిటల్ స్క్రీన్లపై 'స్క్రోలింగ్' చేయడం వల్ల రాని 'స్పేషియల్ మెమరీ' పుస్తక పఠనం వల్ల కలుగుతుందని చెప్పారు. పేజీల స్థిరత్వం వల్ల మన ధారణా శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
సమాచారం కోసం గూగుల్ చేయవచ్చు కానీ.. విజ్ఞానం కావాలంటే మాత్రం పుస్తకాన్ని చదవాల్సిందేనన్నారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలంటూ తల్లిదండ్రులకు ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సూచించారు. తమ రాజ్యాంగ హక్కులతోపాటు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని యువతకు ఆయన హితబోధ చేశారు. ఎవరి పని వారు సరిగా చేస్తే చాలు.. ఈ దేశం అభివృద్ది చెందుతుందన్నారు. రాజకీయ పార్టీలు తమ పని తాము చేయడం మానేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరేవాడినని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
కానీ నేడు ఎన్నికల సంఘమే అంతా చూసుకుంటుందని పార్టీలు నిర్లక్ష్యంతో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త, నాయకులు ఓటర్‌ను కలిసి గుర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పోలింగ్ బూత్‌కు వచ్చిన సమయంలో వెంటనే వారికి అతని నిజమా?, నకిలీనా? అనే విషయం తెలిసిపోతుందన్నారు. తమ బాల్యంలో ఇలాగే ఇంటింటికీ వెళ్లే వాళ్లం కాబట్టి అందరూ తెలిసేవారని చెప్పారు. కిందిస్థాయిలో చేయాల్సిన బాధ్యతలను రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అట్టడుగు స్థాయిలో (గ్రాస్ రూట్ లెవల్) పని చేస్తేనే.. తప్పులను వెంటనే పట్టేసే అవకాశం ఉంటుందన్నారు. పుస్తకం మంచి నేస్తమని ప్రతి ఒక్కరూ మంచి పుస్తకాలను చదవాలని ప్రజలకు వెంకయ్య నాయుడు సూచించారు. పుస్తకం చదివితే.. మీ మస్తికంలోకి వెంటనే ఎక్కుతుందన్నారు. ప్రతి ఊరిలో గ్రంథాలయం ఉండటం చాలా అవసరమన్నారు. ప్రవాస భారతీయులు, ప్రవాస తెలుగు వాళ్లు.. వారి వారి స్వగ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాల్సి ఉందని పిలుపునిచ్చారు. గ్రంధాలయాలు పూర్వ వైభవం కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ గ్రంధాలయాలకు వెళ్లి పుస్తకాలు చదవాలని, చరిత్ర తెలుసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎయిర్ పోర్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంపీ కలిశెట్టి
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
For More AP News And Telugu News