యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు షాక్.. రిమాండ్ పొడిగించిన గన్నవరం కోర్టు..
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:37 PM
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసులో అరెస్టయిన యూట్యూబర్ బచ్చలకూరి రావణ్‌కు గన్నవరం కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కృష్ణా జిల్లా: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కేసులో అరెస్టయిన యూట్యూబర్ బచ్చలకూరి రావణ్‌కు గన్నవరం కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఆయన రిమాండ్‌ను ఈ నెల 22 వరకు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న రావణ్‌ను విచారణ నిమిత్తం గన్నవరం కోర్టుకు పోలీసులు తరలించారు. విచారణ అనంతరం రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై జులై 5న రావణ్‌పై కేసు నమోదైంది. ఆ మరుసటి రోజే కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. అప్పటి నుంచి రావణ్‌కు కోర్టు పలుమార్లు రిమాండ్ విధిస్తూ వస్తోంది. దీంతో ఆయన జైలులోనే ఉంటున్నారు. తాజాగా మరోసారి విచారించిన న్యాయస్థానం.. కేసు తీవ్రత దృష్ట్యా రిమాండ్‌ను పొడిగించింది.
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
రావణ్ కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ సందర్భంగా మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ రావణ్ చేసిన ప్రసంగాల వీడియోలను పోలీసులు గుర్తించారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సాయుధ తిరుగుబాటును ప్రేరేపించేలా మాట్లాడారని రిమాండ్ రిపోర్టులో వారు ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలను కూల్చివేయాలనేలా ప్రసంగించినట్లు తెలిపారు. వాక్ స్వాతంత్య్రం ముసుగులో యువతలో తీవ్రవాద ఆలోచనలను చొప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వీటికి సంబంధించిన వీడియోలను కోర్టుకు పోలీసులు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మెగా డీఎస్సీపై వైఎస్ జగన్, వైసీపీది దిగజారుడు రాజకీయం: బొండా ఉమామహేశ్వరరావు..
ఏపీలో కిలో ఉల్లిపాయ రూ.32కే.. వచ్చే వారం నుంచే విక్రయాలు: నాదెండ్ల మనోహర్