తిరుపతి లడ్డూ కేసు.. ఇతర రాష్ట్రాలకు విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:17 PM
తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.
ఢిల్లీ, నవంబర్ 5: తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుత దశలో కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన డెయిరీ పరిశ్రమ వ్యాపారవేత్త, మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మచీంద్ర శాంతారాం లంకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆయన నిందితుల్లో ఒకరు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
ఏపీలో కేసు విచారణకు అనుకూల వాతావరణం లేదని కోర్టుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వరుసగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేసును పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కోరారు. సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారా? అని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ ప్రశ్నించారు. ‘మా ఆదేశాలతో వారందరినీ మౌనంగా ఉండేలా చేశాం. ఏదైనా జరిగితే మీరు మా వద్దకు రావచ్చు’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కేసు బదిలీకి తగిన కారణాలు కనిపించడం లేదని చెబుతూ.. ప్రస్తుత దశలో విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
రాప్తాడులో ప్రశాంతంగా పరిషత్ పోలింగ్.. వైసీపీ ఆరోపణలపై పరిటాల సునీత ఫైర్
పెనగలూరులో పెట్రోల్ బాంబుల దాడి ప్రచారం అవాస్తవం: తిరుపతి ఎస్పీ
Read Latest AP News And Telugu News