ఏపీ ప్రయోజనాలను అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:59 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రయోజనాలను లేవనెత్తారు.
న్యూఢిల్లీ, జనవరి 27: ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Srikrishnadevarayalu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రయోజనాలతో పాటు దేశవ్యాప్త సమస్యలను లేవనెత్తినట్లు ఎంపీ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భేటీలో ప్రధానంగా 16 ఏళ్లలోపు యువతకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా నిషేధించాలనే అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరినట్లు తెలిపారు. పొగాకుపై సెస్ స్థానంలో జీఎస్టీ ప్రవేశపెట్టడం వల్ల చాలా గందరగోళ పరిస్థతి ఏర్పడిందన్నారు.
పొగాకు వాణిజ్యం స్తంభించిపోయిందని.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. ఈ అంశంపై చర్చ జరిగి సమస్య పరిష్కారం జరగాలని కోరానన్నారు. ఛార్జ్‌షీట్ నమోదైనా చాలా మంది క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ఈ అంశంపైనా పార్లమెంటులో చర్చ అవసరమని లేవనెత్తినట్టు ఎంపీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరామన్నారు ఎంపీ. పూర్వోదయ పథకం కింద ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను చేర్చినట్లే ఆంధ్ర ప్రదేశ్‌కూ ఈ పథకం వర్తింపజేయాలని.. దీనిపై చర్చ జరగాలని కోరినట్లు తెలిపారు. గతంలో జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి 26 వేల కోట్లు మంజూరైనా.. రాష్ట్ర వాటా కింద నిధులు సమకూర్చాల్సి వస్తుందని, కేవలం రూ.2 వేల కోట్ల కేంద్ర నిధులు మాత్రమే వినియోగించుకున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చగలిగితే రాష్ట్రం వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉందని, ఈ అంశంపై చర్చ జరగాలని ప్రతిపాదించామని లావు శ్రీకృష్ణదేరాయలు పేర్కొన్నారు.
కాగా.. ఢిల్లీలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించింది కేంద్రం. ఈ సమావేశానికి వివిధ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, పిల్లి సుభాశ్ చంద్రబోస్, బీఆర్ఎస్ నుంచి కేఆర్.సురేశ్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News