Share News

ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా జగన్ పర్యటనలు: టీడీపీ ఎంపీ ఎద్దేవా

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:39 PM

ఏపీలో మాజీ సీఎం జగన్ చేస్తున్న పర్యటనలపై ఎంపీ అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా జగన్ పర్యటనలు ఉన్నాయని మండిపడ్డారు.

ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా జగన్ పర్యటనలు: టీడీపీ ఎంపీ ఎద్దేవా
TDP MP Kalisetti Appalanaidu

అమరావతి, ఫిబ్రవరి 6: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (Former CM YS Jagan Mohan Reddy) టీడీపీ ఎంపీ అప్పలనాయుడు (TDP MP Appalanaidu) తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే జగన్.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారని అన్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన వ్యక్తుల ఇంటికి పరామర్శకు వెళ్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని ఎంపీ ధ్వజమెత్తారు.


ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జగన్ పర్యటనలు సాగుతున్నాయని ఎంపీ అప్పలనాయుడు విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చర్యలు చేపడుతుంటే.. దానికి జగన్ ఆటంకం కలిగిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. జగన్ పర్యటనలపై ప్రజలు విసుక్కుంటున్నారని.. వైసీపీ నేతలు బూతు పురాణాలు తగ్గించాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నట్టు జగన్ తన పర్యటనలు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమాజానికి మార్గదర్శకంగా రాజకీయ నేతలు ఉండాలని హితవుపలికారు.


వైసీపీ నేతలు.. వంగవీటి రంగా కోసం ఎప్పుడైనా విజయవాడలో ఒక్క కార్యక్రమమైనా చేశారా? అని ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో తిరుపతి లడ్డూపై చర్చ జరుగుతోందని.. ఎవరైనా లడ్డూ ఇస్తే ఎవరి హయాంలో తయారయ్యిందని అడుగుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. కాపులకు, బీసీలకు రక్షణగా ఉన్నది టీడీపీ మాత్రమే అని స్పష్టం చేశారు. తనలాంటి వారిని చట్టసభలకు పంపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఎంపీ అప్పలనాయుడు ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి...

రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?

70 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కరుడుగట్టిన నేరస్థుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 05:14 PM