70 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కరుడుగట్టిన నేరస్థుడు
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:04 PM
శ్రీ సత్యసాయి జిల్లాలో కరుడుగట్టిన నేరగాడు నాగేంద్రను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తా, కోడళ్లపై అత్యాచారానికి పాల్పడిన నాగేంద్ర.. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
అమరావతి, ఫిబ్రవరి 6: శ్రీ సత్యసాయి జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపైనే దాడికి దిగిన అతడిని కాల్పులు జరిపి మరీ అదుపులోకి తీసుకున్నారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. దాదాపు 40 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు.. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. చిలమత్తూరు అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలియడంతో.. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లగా వారిపై దాడికి తెగబడ్డాడు.
పోలీస్ సిబ్బందిపై నాగేంద్ర కత్తితో దాడి చేయడంతో.. రవి అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు సిబ్బందితో కలిసి సీఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు.. నాగేంద్రపై కాల్పులు జరిపారు. గన్‌తో నిందితుడి కాళ్లపై షూట్ చేసి.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
నాగేంద్రపై 70 కేసులు..
నిందితుడు నాగేంద్రపై ఆంధ్రా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సుమారు 70 కేసులు ఉన్నాయి. కేవలం ఏపీలోనే అతనిపై 40 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కరుగుడట్టిన నేరస్థుడిని వెంటాడి మరీ అరెస్ట్ చేయండంతో ఈ ఆపరేషన్ చేపట్టిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షలో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు కొద్ది నెలలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చివరకు శుక్రవారం నాడు నాగేంద్రను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఉన్న అనేక కేసుల్లో విచారణ పూర్తిచేసి, పక్కా ఆధారాలతో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో కీలక మలుపు.. లాస్ట్ కాల్ ఆధారంగా..
రాజమండ్రిలో పులి కదలికలు.. అటవీశాఖ అధికారి ఏం చెప్పారంటే?
Read Latest AP News And Telugu News