ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.. సైకిల్ యాత్రలో పాల్గొనండి: పల్లా శ్రీనివాస్
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:35 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు మహత్తర కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు సైకిల్ యాత్ర చేపట్టనుందని వెల్లడించారు.
అమరావతి, జూన్ 4: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు(శుక్రవారం) మహత్తర కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు సైకిల్ యాత్ర చేపట్టనుందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రేపు బాధ్యతగా సైకిల్ వినియోగించాలని అన్నారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ ప్రయాణం చేయనున్నట్లు చెప్పారు. ప్రపంచం నేడు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.
ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. ప్రజలు కూడా సైకిల్ యాత్రలో భాగస్వాములు కావాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సైకిల్ వినియోగం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన వినియోగం తగ్గుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకొచ్చారు. చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు నాంది పలుకుతాయన్నారు. ‘నా దేశం నా బాధ్యతలో’ భాగంగా ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగం తగ్గించాలన్నారు. ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించి గ్రాండ్ సక్సెస్ సాధించామని తెలిపారు. ప్రజలందరూ సైకిల్ యాత్రలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు ‘నేను సైతం’ అంటూ ముందుకు రావాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఏపీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములవ్వండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రతి పాటలో కొత్త భావాన్ని పంచిన మహాగాయకుడు ఎస్పీబీ: జగన్
Read Latest AP News And Telugu News