జోగి రమేశ్ నివాసానికి పోలీసు బృందాలు..
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:25 PM
తన నివాసంపై పెట్రోల్ బాంబులు వేశారంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 02: తన నివాసంపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం రాత్రి ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జోగి నివాసం వద్ద శాంపిల్స్‌ను పోలీసులతోపాటు ఫోరెన్సిక్ బృందాలు సేకరిస్తున్నాయి.
అలాగే దాడికి సంబంధించిన వివరాలను సైతం పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఆధారాలు సేకరించిన తర్వాత.. జోగి రమేశ్ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను ఇబ్రహీంపట్నం పోలీసులు రికార్డు చేశారు.
సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమవారం ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. స్థానిక రింగ్ సెంటర్ వద్ద జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై వారు నిరసన చేపట్టారు. అనంతరం జోగి నివాసం వైపు వారు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. వారిని కార్యకర్తలు నెట్టివేసి ముందుకు సాగారు. అనంతరం జోగి నివాసంపై వారు దాడికి ప్రయత్నించారు. మరోవైపు ఈ దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. తనను అంతం చేయడానికే ఈ దాడి జరిగిందంటూ జోగి రమేశ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్
For More AP News And Telugu News