Share News

ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకం: మంత్రి నిమ్మల రామానాయుడు

ABN , Publish Date - May 11 , 2026 | 03:43 PM

పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్ స్పష్టం చేసినట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడంలో పోలవరం కీలకమని తెలిపారు.

ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకం: మంత్రి నిమ్మల రామానాయుడు
Minister Nimmala Ramanaidu

న్యూఢిల్లీ, మే 11: పోలవరం ప్రాజెక్ట్‌ 2027 జూన్ నాటికి పూర్తవుతుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయనున్నారని వెల్లడించారు. సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. గంటపాటు సాగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ సహా రాష్ట్రంలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంపై మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు చెప్పారు.


ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడంలో పోలవరం కీలకమని మంత్రి తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. పోలవరం సివిల్ వర్క్స్, ఆర్ అండ్ ఆర్ అంశాలను కేంద్ర మంత్రికి వివరించామన్నారు. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలు పూర్తి చేయడంలో కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారన్నారు. గత ఏప్రిల్ నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు.


తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వైసీపీ పాలనలో వాటిని పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. గత ఏడాది 19వ గేటు కొట్టుకుపోయిందని.. కొత్త గేట్ల ప్రారంభోత్సవంపై కేంద్ర మంత్రితో చర్చించామని వెల్లడించారు. గోదావరి కావేరి అనుసంధానం చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి తెలిపారు. గోదావరి కావేరి ఏ విధంగా ఇంటర్ లింకింగ్ చేయాలన్న దానిపైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గోదావరిలో ప్రతి సంవత్సరం సుమారు 3000 టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఈ మిగులు జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలకు లాభం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి చెబుతున్నారని తెలిపారు.


భూగర్భ జలాలను పెంపొందించేందుకు కార్యాచరణ చేపట్టామని రామానాయుడు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కలెక్టర్లతో గ్రౌండ్ వాటర్ సమస్యలపై సమీక్ష నిర్వహించారన్నారు. దేశంలో ప్రయోగాత్మకంగా ఎంసీఏడీ (MCAD) మోడల్ సిస్టమ్‌ను విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్మాణంపై సుప్రీం కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి అభ్యంతరాలపై చర్చించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

శాంతిభద్రతలపైనే సీఎం చంద్రబాబు దృష్టి: హోం మంత్రి అనిత

ప్రభుత్వ సచివాలయాల్లో చోరీ.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2026 | 04:03 PM