కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:00 PM
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 28: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పవన్ సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో వినతిపత్రం సమర్పించారు పవన్. పీఎం గతి శక్తి పథకం కింద పిఠాపురం పరిధిలో సామర్లకోట - ఉప్పాడ రోడ్డుపై రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరిన పవన్.. ఇది ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుందని అన్నారు. జాతీయ రైల్వే ప్రణాళిక - 2030లోని మాన్యువల్ లెవల్ క్రాసింగ్‌లను తొలగించాలనే లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని పవన్ వివరించారు.
ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. శక్తిపీఠం, పాదగయ, శ్రీపాద వల్లభస్వామి ఆలయాలు ఉన్న ఈ పట్టణానికి తగిన మౌలిక వసతులు, ఆధునిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. పిఠాపురం నుంచి కాకినాడకు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం సామర్లకోట మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ప్రయాణికులు, సరుకు రవాణాకు ఎక్కువ సమయం పడుతోందని, అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
కాగా.. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మరికొంత మంది కేంద్రమంత్రులతో భేటీ అవనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ సమావేశమవుతారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో డిప్యూటీ సీఎం భేటీ అవనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రులను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
నేడు గద్దెపైకి సారలమ్మ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం
బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం
Read Latest AP News And Telugu News