Share News

నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా సాకారం చేసిన సీఎం చంద్రబాబు: దేవినేని ఉమా

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:14 PM

డాక్టర్ కేఎల్ రావు కలగన్న గంగా - కావేరి నదుల అనుసంధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి - కృష్ణ నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా సాకారం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు.

నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా సాకారం చేసిన సీఎం చంద్రబాబు: దేవినేని ఉమా
TDP Leader Devineni Uma Maheshwara Rao

విజయవాడ, జులై 17: డాక్టర్ కేఎల్ రావు కలగన్న గంగా - కావేరి నదుల అనుసంధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి - కృష్ణ నదుల అనుసంధానాన్ని పట్టిసీమ ద్వారా సాకారం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ పట్టిసీమను "వట్టిసీమ" అని విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పంపుల ద్వారా నీటిని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. పట్టిసీమ నిర్మాణం సమయంలో జగన్ మమ్మల్ని అవమానించారని తెలిపారు. జగన్‌ పాలనలో అదే పట్టిసీమ దిక్కు అయ్యిందని వ్యంగ్యంగా అన్నారు.


అమరావతి నిర్మాణం, పట్టిసీమ విషయంలో అడ్డంకులు సృష్టించడం వల్ల రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిందని దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, కులాలను రెచ్చగొట్టారు.. మా దిష్టి బొమ్మలను దగ్ధం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు అకుంఠిత దీక్షతో మార్చి 2025లో ప్రారంభించి.. సెప్టెంబర్‌లోనే తొలి విడతగా కొంత నీటిని డెల్టాకు మళ్లించారని చెప్పారు. ఆ తర్వాత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు నీరు అందించి సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రాయలసీమ రతనాల సీమగా మార్చేందుకు అంకురార్పణ చేయడం ద్వారానే పరిశ్రమలు కూడా ఆ ప్రాంతానికి వచ్చాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా పట్టిసీమ ద్వారానే డెల్టాకు నీరు అందించడం దేవుడు రాసిన స్క్రిప్టు అని అభివర్ణించారు.


పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు అందడం వల్ల చౌడు భూములు కూడా సారవంతంగా మారాయని దేవినేని ఉమా తెలిపారు. దీని వల్ల ఎకరాకు దిగుబడి 50 నుంచి 60 బస్తాలకు పెరిగిందని చెప్పారు. సాగు నీరు సమృద్ధిగా అందడం వల్ల ఎరువుల ఖర్చు తగ్గి, రైతుల ఆదాయం పెరిగిందని వివరించారు. కరువు సమయాల్లో కూడా నీటిని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ చెరువులు నింపడం, నారుమళ్లను కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు తక్కువ వర్షపాతంతో ఇబ్బంది పడిన రాయలసీమ.. నేడు హార్టికల్చర్ రంగంలో అద్భుతాలు చేస్తోందని వివరించారు. ఉరవకొండ వంటి ప్రాంతాల్లో రైతులు అరటి, చీని (బత్తాయి), కూరగాయలు, పూల సాగు ద్వారా కోటీశ్వరులుగా మారుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా సంతోషం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. పెద్ద ప్లానింగే.. వీడియో వైరల్

ఇతడి టాలెంట్ ముందు కంప్యూటర్ కూడా దిగదుడుపే.. వీడియో వైరల్..

For More AP News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 05:22 PM