‘మోదీ జీ.. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 31 , 2026 | 03:49 PM
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 1న విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
అమరావతి, జులై 31: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మితమైన ఈ విమానాశ్రయాన్ని రేపు(ఆగస్టు 1న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ‘రేపు భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్నాం’ అంటూ ఏపీ పర్యటనపై ఎక్స్‌లో ప్రధాని పోస్ట్ చేశారు. ఉత్తరాంధ్రకు మౌలిక సదుపాయాల కల్పనలో కీలక అడుగు పడుతోందని చెప్పారు.
ప్రధాని పోస్ట్‌ను ట్రాక్ చేస్తూ సీఎం చంద్రబాబు రీ పోస్ట్ చేశారు. ‘ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది... మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం మోదీ జీ’ అంటూ పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని, ఉత్తరాంధ్రకు గేట్‌వేగా భోగాపురం ఎయిర్‌పోర్టు నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ట్రాఫిక్, భద్రత, ప్రజా సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర మణిహారమని, విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వస్తాయని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా 7 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి
19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు
Read Latest AP News And Telugu News