Share News

కూటమిని విడదీయడం ఎవరితరం కాదు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:35 PM

ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని నేతలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు ఎవరూ అలగవద్దని.. సమస్యలను కూర్చొని చర్చించుకుందామని సూచించారు..

కూటమిని విడదీయడం ఎవరితరం కాదు: మంత్రి లోకేశ్
Nara Lokesh

అమరావతి, జనవరి 30: టీడీపీ 11వ బ్యాచ్ క్యాడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara lokesh) ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ఓర్పుతో, ఐక్యంగా దుష్ప్రచారాలను ఎదుర్కోవాలని సూచించారు. అభివృద్ధిపైనే కాదు, దుష్ప్రచారాల రాజకీయాన్ని కూడా ఎదుర్కోవాలని చెప్పారు. 2014 -19 మధ్య టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా.. వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డామని, అదే ఓటమికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.


డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌లతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. కూటమి నాయకుల మధ్య సఖ్యత చాలా ముఖ్యమని లోకేశ్ పేర్కొన్నారు. కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా, కూటమిని విడదీయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో కూటమి నేతలందరినీ కలుపుకొని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు ఎవరూ అలగవద్దని... సమస్యలను కూర్చొని చర్చించుకుందామని సూచించారు. తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.


విద్యార్థులతో ముఖాముఖి..

మరోవైపు కాకినాడలో పర్యటించిన మంత్రి లోకేశ్.. జేఎన్టీయూ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ‘హలో లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు.. లోకేశ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ‘మీరెప్పుడైనా క్లాస్‌లకు బంక్ కొట్టారా?’ అని విద్యార్థులు అడగ్గా.. లోకేశ్ నవ్వుతూ ‘తాను ఎప్పుడూ బంక్ కొట్టలేదు’ అని సమాధానమిచ్చారు. తన ఎంబీఏ చదువులో 90% అటెండెన్స్ ఉందని, తన భార్య బ్రాహ్మణికి 100% అటెండెన్స్ ఉందని ఆయన చెప్పారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా సంభాషించి, వారి సందేహాలను తీర్చారు మంత్రి లోకేశ్.


ఇవి కూడా చదవండి..

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఏపీ నయా రికార్డ్.. సీఎం హర్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 04:08 PM