ఏపీలో మురసు తుఫాన్ బీభత్సం.. 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంట నష్టం
ABN , Publish Date - Nov 03 , 2026 | 01:59 PM
ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంతో 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
అమరావతి, నవంబర్ 3: ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంతో 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుఫాన్ కారణంగా అత్యధికంగా పంటలు దెబ్బతినట్లు గుర్తించారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు బాగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. 15 జిల్లాల్లోని 132 మండలాల్లో సాధారణ స్థాయికంటే మించి మురసు తుఫాన్ ప్రభావం చూపినట్లు అంచనాకు వచ్చారు.
ఇక.. తుఫాన్ తీరం దాటే సమయంలో మార్కాపురం జిల్లా డోర్నాల వద్ద గంటలకు 107 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 10,805 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మొత్తం 171 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు.. 14,810 ఆహార పొట్లాలను సరఫరా చేశారు. 11 ఎన్డీఆర్‌ఎఫ్, 13 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సహాయక చర్యలకు తరలించారు. 613 జనరేటర్లను అధికారులు సిద్ధం చేశారు. తుఫాన్ సమయంలో కూలిన చెట్లను, నిలిచిపోయిన నీళ్లను తొలగించడానికి అగ్నిమాపకదళ బృందాలను తరలించారు. చెట్లు తొలగించడానికి 185 బృందాలను సిద్ధం చేశారు.
తుఫాన్ వచ్చే ముందే 3066 మంది గర్భిణులను, 1008 బాలింతలను సురక్షితమైన ఆసుపత్రులకు అధికారులు తరలించారు. 13 జిల్లాల్లో 725 వైద్య బృందాలను వైద్య ఆరోగ్యశాఖ తరలించింది. అత్యవసర సేవల కోసం 362 అంబులెన్సులను సిద్ధం చేశారు. 3.77 కోట్ల మంది మొబైల్ ఫోన్లకు తుఫాన్ హెచ్చరికల సందేశాలను నిరంతరం జారీ చేసి అప్రమత్తం చేశారు. తుఫాన్ అత్యవసర సహాయం కోసం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల సదుయాన్ని ఆర్టీజీఎస్ కల్పించింది.
ఇవి కూడా చదవండి..
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు
Read Latest AP News And Telugu News