Share News

అభివృద్ధిని అడ్డుకుంటే తొక్కిపడేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - May 06 , 2026 | 03:24 PM

మచిలీపట్నంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ఐదేళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

అభివృద్ధిని అడ్డుకుంటే తొక్కిపడేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra

కృష్ణా జిల్లా, మే 6: బందరు చరిత్ర తిరగరాసేలా అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈరోజు(బుధవారం) బందరులో తాగునీటి పైపులైన్లు, డీడబ్ల్యూఎమ్‌ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బందరులోని ప్రతి ప్రాంతానికి రోడ్లు, తాగునీటి సౌకర్యాలు అందించేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆరోపణలు, విమర్శలు తప్ప మాజీ మంత్రి పేర్నినానికి బందరు అభివృద్ధి పట్టదని విమర్శించారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే తొక్కి పడేస్తామని కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు.


గతంలో రోడ్లను కూడా పట్టించుకోలేదని వైసీపీపై మంత్రి విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతలు లేని మచిలీపట్నాన్ని సాకారం చేశామన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.28 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించామని తెలిపారు. మచిలీపట్నంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ఐదేళ్లు మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.


గతంలో ఎంపీగా పని చేసిన కొనకళ్ల నారాయణ రావు, ప్రస్తుత ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషితో కేంద్రం నుంచి నిధులు వచ్చాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమకూర్చి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో ఇనుము దొంగిలించేశారంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ఆధారాలు చూపించమంటే తేలుకుట్టిన దొంగల్లా పారిపోతున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డులో పెట్టిన ఇనుము పాడైపోతుంటే.. దాన్ని వేరే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించడంలో తప్పేముందని ప్రశ్నించారు. తప్పు జరిగితే ఫిర్యాదు చేయాలని.. కానీ అధికారులను బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు.


2014-19 మధ్య పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను గత ఐదేళ్లు లబ్ధిదారులకు అందకుండా పాడుబెట్టారని మంత్రి ఆరోపించారు. కరగ్రహారం లే అవుట్ పేరుతో వైసీపీ నాయకులు పేదల భూములను తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మి లాభాలు పొందారని వ్యాఖ్యానించారు. ఇళ్లు కట్టుకోవడానికి కూడా పనికిరాని ప్రాంతాల్లో భూ కేటాయింపుల పేరుతో దోచుకున్నారని ఫైర్ అయ్యారు. ఆ లే అవుట్లలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని పేర్ని నాని, జగన్ రెడ్డిని ప్రశ్నించారు. పేర్నినాని రోజూ మీడియా ముందుకు వచ్చి చెత్త ఆరోపణలు చేయడం తప్ప అభివృద్ధి కోసం ఒక్క ఆలోచన కూడా చేయలేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు

శ్రీసత్యసాయి జిల్లాలో హైవే దోపిడీ కేసులు.. ఏడుగురి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 03:35 PM