ప్రజా ఆగ్రహంతోనే అంబటిపై దాడి: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:14 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆగ్రహంతో అంబటిపై దాడి చేస్తే దాన్ని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు.
కృష్ణాజిల్లా, ఫిబ్రవరి 2: ప్రజాగ్రహంతోనే వైసీపీ నేత అంబటి రాంబాబుపై (YCP Leader Ambati Rambabu) దాడి జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. భ్రష్టుపట్టిన వైసీపీపై రోజు రోజుకూ ప్రజల్లో వ్యతిరేక పెరుగుతోందన్నారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక కుల, మతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వంగవీటి మోహన రంగాతో అంబటి రాంబాబును పోల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల కోసం నిలబడిన రంగా స్థాయి ఏమిటి..? రోడ్డుపక్కన అంబోతులా మాట్లాడే అంబటి రాంబాబు స్థాయి ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలు ఆగ్రహంతో అంబటిపై దాడి చేస్తే దాన్ని కులానికి రుద్దే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు.
కులానికి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందే వైసీపీ కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై విమర్శలు చేసే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. అంబటి రాంబాబును ప్రతి ఒక్కరూ చీదరించుకుంటున్నారని తెలిపారు. తాము చాలా సంయమనంతో ఉన్నామన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అశాంతిని నిలపాలన్నదే లక్ష్యంగా జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను ప్రజలందరూ గమనించాలని మంత్రి కోరారు.
పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నాని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. సొంత భార్య పేరు మీద వ్యాపారం చేసి ఆమెను కేసులో ఇరికించిన వ్యక్తి పేర్ని నాని అంటూ విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తి జోగి రమేష్ అని అన్నారు. ‘నా బీసీలు అంటూ జోగి రమేశ్ మాట్లాడుతుండటం హాస్యాస్పదం. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలమైన మాపై దాడులు, అరెస్ట్‌లు జరిగినప్పుడు జోగి రమేశ్ ఏమయ్యారు.. ఏం మేం బీసీలం కాదా’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య రాకుండా చూస్తున్నామన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నేతపై కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన
సీఎంను తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం.. అంబటిపై శ్రీనివాస్ వర్మ ఆగ్రహం
Read Latest AP News And Telugu News