కృష్ణా జిల్లా పరిధిలో అక్రమంగా గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:25 PM
కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 171 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా, జనవరి 24: గంజాయి అక్రమ రవాణాపై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 171.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 23న చిన్నవుటపల్లి సమీపంలో చేపట్టిన వాహన తనిఖీల్లో AP 39 UP 4715 నంబర్ ప్లేట్ గల వ్యాన్‌లో గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్టు వివరించారు.
నిందితులు హనుమంత దుర్గా ప్రసాద్(38), సయ్యద్ ముబారక్(36)గా గుర్తించామన్నారు ఎస్పీ. వారి నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన నిఘా పెట్టామని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విద్యాసాగర్ హెచ్చరించారు.
గంజాయి మాఫియాపై జిల్లాలో ముమ్మర దాడులు చేపడుతోంది జిల్లా పోలీస్ యంత్రాంగం. ఈ దాడుల్లో గన్నవరం ప్రాంతంలో ఇటీవల 112 కిలోల గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో.. ఒడిశా నుంచి పుణేకు తరలిస్తుండగా గన్నవరం పీఎస్ పరిధిలోని బీబీగూడెం అండర్ పాస్ వద్ద వాహన తనిఖీల్లో ఈ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు విలువ సుమారు రూ.5.60 లక్షలుగా ఉంటుందని తెలిపారు. ఆ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి...
ప్రియుడి కోసం తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య..
ఘోర రోడ్డుప్రమాదాలు.. స్పాట్ లోనే ఇద్దరి మృతి..
Read Latest AP News And Telugu News