Share News

జైలు నుంచి జోగి సోదరులు విడుదల

ABN , Publish Date - Jan 24 , 2026 | 07:02 AM

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రాము శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.

జైలు నుంచి జోగి సోదరులు విడుదల

  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె కోర్టు బెయిల్‌ మంజూరు

  • ఇబ్రహీంపట్నం కేసులోనూ ఇటీవలే బెయిల్‌

  • 83 రోజుల జైలు జీవితానికి విముక్తి

విజయవాడ/ములకలచెరువు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రాము శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టు వారికి శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో విజయవాడ జిల్లా జైలు నుంచి బయటకు అడుగుపెట్టారు. ములకలచెరువు కేంద్రంగా జరిగిన నకిలీ మద్యం తయారీ గుట్టును గత ఏడాది అక్టోబరు 3న ఎక్సైజ్‌ పోలీసులు రట్టు చేశారు. ఇక్కడ తీగ లాగితే ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా డొంక కదలడంతో అక్కడ కూడా నకిలీ మద్యం తయారీ యూనిట్‌పై దాడులు చేశారు. రెండు కేసుల్లోనూ ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు(ఏ1) వాంగ్మూలంతో నవంబరు 2న జోగి సోదరులను అరెస్టు చేశారు. అలాగే ములకలచెరువు నకిలీ మద్యం కేసులోనూ జోగి సోదరుల పాత్ర, కుట్ర బయటపడడంతో డిసెంబరు 2న వారిని తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. జోగి సోదరులకు ఈనెల 20న ఇబ్రహీంపట్నం కేసులో విజయవాడ కోర్టు షరతులతో బెయిల్‌ మంజూరు చేసినా ములకలచెరువు కేసులో బెయిల్‌ రాకపోవడంతో అప్పుడు విడుదల కాలేదు. తాజాగా ములకలచెరువు కేసులో కూడా బెయిల్‌ మంజూరు కావడంతో జోగి సోదరులు విజయవాడ జైలు నుంచి విడుదల అయ్యారు. దీంతో 83 రోజుల జైలు జీవితానికి విముక్తి లభించింది. జైలు నుంచి విడుదలయ్యాక జోగి రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించి 83 రోజులు జైల్లో ఉంచి, కోర్టుల చుట్టూ తిప్పారని, సిట్‌ అధికారులు చంద్రబాబు చెప్పినట్లే వింటున్నారని విమర్శించారు. తనపై కేసులు పెట్టిన అధికారులను భగవంతుడు శిక్షిస్తాడని శాపనార్థాలు పెట్టారు.

Updated Date - Jan 24 , 2026 | 07:03 AM