కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వేధింపులు.. మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - Nov 05 , 2026 | 03:35 PM
కొఠియా గ్రూప్ గ్రామాలలో ఒరిస్సా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓటేయటానికి వెళుతున్న గిరిజనులకు వేధింపులకు గురిచేస్తున్నారు. ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు సమస్య ఉన్న కొఠియా గ్రామాలలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు.
పార్వతీపురం మన్యం, నవంబర్ 5: కొఠియా గ్రూప్ గ్రామాలలో ఒరిస్సా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓటేయటానికి వెళుతున్న గిరిజనులకు వేధింపులకు గురిచేస్తున్నారు. ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు సమస్య ఉన్న కొఠియా గ్రామాలలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొఠియా 29 గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసులు ఆగడాలు ఎక్కువైపోయాయన్నారు. గిరిజనులపై బెదిరింపులు, దాడులు, కిడ్నాప్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు వద్దనుకుంటే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని.. గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
అమాయక గిరిజనులపై ప్రతాపం చూపిస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దును భారత్-పాకిస్థాన్ సరిహద్దులా మార్చొద్దన్నారు. గిరిజనుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కొఠియా గ్రామాలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే హంగామా
పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అలజడి సృష్టించారు. బలిజిపేట మండలం చిలకలపల్లిలో తన అనుచరులతో కలసి ఓటేయానికి వెళుతూ హంగామా చేశారు. పోలింగ్ బూత్ దగ్గరకు గుంపుగా వెళుతున్న జోగారావు, అనుచరులను వీడియో తీస్తున్న వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే నెట్టివేశారు. జోగారావు తీరుపట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ దాడులు, ఎన్నికల ఉల్లంఘనలపై ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
అనంతపురం పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు.. ఇద్దరిపై దాడి
Read Latest AP News And Telugu News