నన్ను మట్టుబెట్టాలనే కుట్రతోనే దాడి: జోగి రమేష్
ABN, Publish Date - Feb 02 , 2026 | 03:27 PM
ప్లాన్ ప్రకారమే తన నివాసంపై దాడి చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టి మరీ దాడి చేయించారని, కొన్ని వందల మంది వచ్చి తన ఇంటిపై దాడి చేశారని మాజీ మంత్రి తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 2: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో టీడీపీ శ్రేణులు ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై సోమవారం జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ప్రజాస్వామ్యంపై, బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిగా చూడాలన్నారు. ప్లాన్ ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు.
జోగి రమేష్ గొంతు నొక్కితే వైసీపీ గొంతు నొక్కినట్లు అవుతుందని.. తద్వారా పార్టీ శ్రేణులను భయపెట్టాలని కొందరు చూస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టి దాడి చేయించారన్నారు. కొన్ని వందల మంది వచ్చి తన ఇంటిపై దాడి చేశారని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. తనపై దాడి చేయాలని, దాడి ముసుగులో తనను మట్టుబెట్టాలనే కుట్ర చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన. నిజంగా అలాంటి ఆలోచనే లేకపోతే.. ఇంతమందిని పోగుచేసి తన ఇంటిపై దాడి చేయించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు జోగి. తప్పుడు కేసులతో తనను, తన తమ్ముడిని అరెస్టు చేసి హింసించారన్నారు. తాను తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకు అయినా సిద్ధమని జోగి స్పష్టం చేశారు.
వైసీపీ జెండా పట్టుకోవడమే తన తప్పా అని ప్రశ్నించారు. అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఇక్కడికి వచ్చిన తన కొడుకును రెండు నెలల్లోనే అరెస్టు చేసి వేధించారని జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన తాను అనకూడని మాటలు ఏమైనా అన్నానా అని ప్రశ్నించారు. ‘మేం రాజకీయాల్లో ఉండకూడదా?.. ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదా?.. మీ అరాచకాలను ప్రశ్నించడం తప్పా?.. ఏపీలో రాచరిక వ్యవస్థ నడుస్తోంది’ అంటూ మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన
సీఎంను తిట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం.. అంబటిపై శ్రీనివాస్ వర్మ ఆగ్రహం
Read Latest AP News And Telugu News
Updated at - Feb 02 , 2026 | 04:41 PM