అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. భారీగా బంగారం స్వాధీనం
ABN , Publish Date - Aug 22 , 2026 | 07:28 PM
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
తిరువూరు, ఆగస్టు 22: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ చింతల గోపాలరావును అరెస్ట్ చేసినట్లు తిరువూరు రూరల్ డీసీపీ బి. లక్ష్మీ నారాయణ వెల్లడించారు. అతడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శనివారం తిరువూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పుట్రేల సమీపంలో స్కూటిపై వెళ్తున్న నిందితుడు గోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
సీసీ కెమెరాల ఆధారంగా అతడిని అరెస్ట్ చేశామన్నారు. తమ విచారణలో ఈ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. ఏ కొండూరు, విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అతడు వరుస చోరీలకు పాల్పడుతున్నాడని వివరించారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ అతడి స్వస్థలమని డీసీపీ చెప్పారు. ఆగస్టు10వ తేదీన ఏ. కొండూరు మండలం చీమలపాడు, విస్సన్నపేట మండలం కలగర, తిరువూరు మండలం మల్లేల గ్రామాల్లో వరుస చోరీలు జరిగాయి. ఆయా ఇళ్ల తాళాలను పగులగొట్టి బంగారు నగలు, వెండి వస్తువులతోపాటు నగదు దొంగలించినట్లు ఫిర్యాదు అందిందన్నారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దీంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. అలా అతడిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల
దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్
Read More AP News And Telugu News