Share News

అక్రమంగా గ్రావెల్ తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు

ABN , Publish Date - Mar 08 , 2026 | 08:26 PM

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిపై స్థానిక రైతులు మండిపడుతున్నారు.

అక్రమంగా గ్రావెల్ తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు

విజయవాడ, మార్చి 08: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరు, కొత్తూరు తాడేపల్లి శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిపై గ్రామస్తులు, స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఈ గ్రావెల్ తవ్వకాలను ఆదివారం వారు అడ్డుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న లారీలను అడ్డుకుని తమ నిరసన తెలిపారు. తమ మామిడి తోటలను అక్రమంగా కబ్జా చేసి.. గ్రావెల్ తరలిస్తున్నారంటూ ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు వందల ఎకరాల్లో 20అడుగులపైనే గ్రావెల్‌ను తవ్వేశారని ఆరోపించారు. దీనిపై తాము ప్రశ్నిస్తే.. తమకు రాజకీయ నేతలు, పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలున్నాయంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు.


అదే సమయంలో సదరు ప్రాంతానికి మీడియా చేరుకుంది. దాంతో లారీలు, జేసీబీలను వదిలి నిర్వహకులతోపాటు డ్రైవర్లు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తమ భూముల్లో ముమ్మాటికి అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ రైతులు చెప్పుకొచ్చారు. ఇక మైనింగ్ ధాటికి మామిడి చెట్లు కుప్పకూలాయని.. అలాగే పర్యావరణం పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకుని న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని రైతులు వేడుకున్నారు.


ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. రూటు మార్చి తరలిస్తున్న గ్రావెల్ రవాణా వాహనాలను వెలగలేరులో రైతులు అడ్డుకున్నారు. దీంతో భారీగా టిప్పర్‌లు నిలిచిపోయాయి. న్యాయం జరిగే వరకూ వాహనాలను వదలమంటూ నిరసన బాట పట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాల వారిని శాంతపరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి.. మరొకరికి గాయాలు

వాట్సాప్ గ్రూప్‌లో బాలుడి మృతదేహం ఫొటో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

For More AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 09:39 PM