2029లోపు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:22 AM
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో యనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు.
అమరావతి, ఆగస్టు 17: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో యనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. గోదావరి పశ్చిమ డెల్టాలో యనమదురు డ్రైన్ ముఖ్యమైనదన్నారు. 23వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న యనమదురు డ్రైన్‌కు, సామర్థ్యానికి మించి వరద వస్తోందని తెలిపారు. యనమదురు డ్రైన్ సామర్థ్యాన్ని 30వేల క్యూసెక్కులకు పెంచడం, శిథిలావస్థకు చేరిన ఇన్‌లెట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
యనమదురు డ్రైన్‌లో 86 ఇన్‌లెట్లకు గానూ 70 ఇన్‌లెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు విడతల్లో రూ.3.2 కోట్లు కేటాయించి,10 ఇన్‌లెట్లను పునర్నిర్మిస్తున్నామన్నారు. యనమదురు డ్రైన్ ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తున్నందున, ఉప్పుటేరును కూడా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రైన్‌ల ఆధునీకరణ కోసం రూ.14 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేసి, డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్ క్యాలెండర్‌ను విడుదల చేశారన్నారు.
36 ప్రాధాన్య ప్రాజెక్టులలో గోదావరి డెల్టా ఆధునీకరణను కూడా చేర్చినట్లు నిమ్మల తెలిపారు. 2029 లోపు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2019-24 పాలనలో ఓఅండ్ఎంకు నిధులు కేటాయించకపోవడంతో పాటు.. డీసిల్టింగ్, లాకులు, షట్టర్లు, రోప్స్ రిపేర్ల వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలోనే రూ.1100 కోట్లకు పైగా నిధులు కేటాయించి ఓఅండ్ఎం పనులను చేపట్టామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 2686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కేసనపల్లి కెనాల్ ప్రాజెక్ట్‌కు అంచనాలు తయారు చేస్తున్నామన్నారు. కొబ్బరి పంట ఆధారిత గ్రామాల్లోకి సముద్రపునీరు చొచ్చుకు వస్తోందని, ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో రూ.50 కోట్లతో కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించామని అన్నారు. 2017-18 గత టీడీపీ పాలనలో జరిగిన డ్రెడ్జింగ్ పనులు మినహా, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి పని కూడా జరుగలేదని తెలిపారు.
డ్రైన్ ద్వారా సముద్రపు నీరు రావడంతో వేలాది ఎకరాల్లో రైతులు కొబ్బరి పంట నష్టపోయారని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, శంఖరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు, నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా పరిశీలించి, మరో రెండు సార్లు సమీక్షలు జరిపి రూ.21 కోట్ల నిధులను విడుదల చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషితో ఆర్థిక శాఖ నుంచి నిధులు సాధించి, పనులు చేపట్టామన్నారు. శంఖరగుప్తం డ్రైన్ పనులు 25 శాతం పూర్తవ్వగా, మే-2027 నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం
మండలిలో బొత్సకు స్ట్రాంగ్ కౌంట్.. మంత్రి అచ్చెన్నాయుడికి అభినందనలు
Read Latest AP News And Telugu News